Begin typing your search above and press return to search.

అమిత్ షా ది ఎన్నికల స్టంటేనా ?

By:  Tupaki Desk   |   15 Oct 2021 4:30 PM GMT
అమిత్ షా ది ఎన్నికల స్టంటేనా ?
X
తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యవహారం చూస్తుంటే తొందరలో జరగబోయే ఎన్నికలను దృష్టి పెట్టుకునే వార్నింగ్ ఇచ్చినట్లుంది. లేకపోతే పాకిస్తాన్ పైన మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని హెచ్చరించటంలో అర్ధమే లేదు. ఎందుకంటే ముందుగా వార్నింగ్ ఇచ్చి చేసేది సర్జికల్ స్ట్రైక్స్ కానేకాదు. పైగా పాకిస్థాన్ కు వార్నింగులు ఇవ్వడం, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని చెప్పటం నిజానికి అమిత్ షా పని కానేకాదు. ఎందుకంటే అమిత్ షా హోంశాఖ మంత్రి మాత్రమే.

విదేశాలతో ఎదురయ్యే సమస్యలు, దేశ రక్షణ వ్యవహారాల గురించి మాట్లాడాల్సింది రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాత్రమే. రక్షణశాఖ మంత్రి అందుబాటులో ఉండగా తనకు ఏమాత్రం సంబంధం లేని పాకిస్తాన్ వ్యవహారాల గురించి, సర్జికల్ స్ట్రైక్స్ గురించి అమిత్ మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ? అమిత్ మాట్లాడిన మాటలు, చేసిన హెచ్చరికలు చూస్తుంటే కొన్ని రాష్ట్రాలకు తొందరలో జరగబోయే ఎన్నికలను దృష్టి పెట్టుకునే చేసినట్లుంది. వచ్చే మార్చిలోగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి కీలకమైన రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

వీటిల్లో గెలుపు కోసమే అమిత్ షా వ్యూహాత్మకంగా పాకిస్థాన్ కు హెచ్చరికలు, సర్జికల్ స్ర్టైక్స్ అంటు అసందర్భంగా మాట్లాడినట్లు అర్ధమవుతోంది. ఎన్నికల్లో గెలవటమంటే బీజేపీ ఎప్పుడు కూడా భావోద్వేగాలను రెచ్చగొడుతుందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏమీ బావోలేదు. పంజాబ్, యూపీలో రైతుల ఉద్యమం దెబ్బకు బీజేపీ చాలా ఇబ్బందులు పడుతోంది.

ఇప్పటికిప్పుడు మతపరమైన అంశాలను ప్రస్తావించే అవకాశం ఎటూలేదు. ఎందుకంటే దశాబ్దాలుగా బీజేపీకి కీలకమైన రామజన్మభూమి అంశం దాదాపు సెటిలైపోయినట్లే. అందుకనే కొత్తగా పాకిస్థాన్ అని సర్జికల్ స్ట్రైక్స్ అని అమిత్ గొంతుచించుకుంటున్నట్లుంది. నిజానికి సర్జికల్ స్ట్రైక్స్ అన్నది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మాత్రమే మొదలైంది కాదు. యూపీఏ హయాంలో కూడా చాలాసార్లు పాకిస్తాన్ భూభాగం పై సర్జికల్ స్ట్రైక్స్ జరిగింది. కానీ అప్పుడెప్పుడు యూపీఏ ప్రభుత్వం దాన్ని తమ ఘనతగా చెప్పుకోలేదు.

ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్స్ అన్నది పూర్తిగా సైన్యానికి సంబంధించిన వ్యవహారం. ఇందులో కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఎలాంటి సంబంధం లేదు. మోడి ప్రధానమంత్రి అయిన తర్వాత మాత్రమే సర్జికల్ స్ట్రైక్స్ ని తమ ఘనతగా చెప్పుకోవడం మొదలైంది. సర్జికల్ స్ట్రైక్స్ ను కూడా తమ ప్రభుత్వం గొప్పతనంగా విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో బీజేపీ+అనుబంధ విభాగాలు ఇదే విషయాన్ని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇందులో భాగమే ఇప్పుడు అమిత్ షా చేసిన హెచ్చరికలు.