Begin typing your search above and press return to search.

‘ఏపీఐఐసీ’ ఏపీలో ఉందా?

By:  Tupaki Desk   |   12 Aug 2020 3:30 AM GMT
‘ఏపీఐఐసీ’ ఏపీలో ఉందా?
X
ఆంధ్రప్రదేశ్ లో ఏపీ సీఎంగా జగన్ అయిన తరువాత పారిశ్రామిక విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కొత్త పెట్టుబడిదారుల కోసం కొత్త కొత్త పాలసీలు తీసుకొచ్చి ఆకర్షించారు. తద్వారా ఏపీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నారు. ప్రతిపక్ష చంద్రబాబు, మీడియా ఎంత జగన్ ను టార్గెట్ చేస్తున్నా.. అంతర్జాతీయ కంపెనీలను ఏపీకి రప్పిస్తూ కంపెనీలు పెట్టిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.

కానీ జగన్ చేసినంత కృషి.. ఏపీఐఐసీ కానీ.. పరిశ్రమల శాఖ కానీ పాటుపడడం లేదన్న విమర్శలు నిరుద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. ఏదో చేస్తున్నట్టు మినిట్స్ , సమావేశాల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాకు ఇచ్చి హల్ చల్ చేయడం తప్పితే ప్రాపర్ గా పనిచేయడం లేదన్న అపవాదు ఉంది. గత 13 నెలలుగా ఎన్ని కంపెనీల వచ్చాయి.. ఎంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు.? అని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు..

ఈ జిల్లాలకు ఏమీ వచ్చాయి? ఎంతమంది దరఖాస్తు చేశారు? ఎంతమందికి ఉద్యోగాలిచ్చాము? చంద్రబాబు కంటే బెటర్ పాలసీలు ఉన్నా చెప్పుకోలేక.. పరిశ్రమలు తెచ్చుకోలేక పోతున్నారనే విమర్శలున్నాయి. వీరి వైఫల్యం కారణంగా ఉద్యోగాలు దక్కక పెద్ద ఎత్తున యువత రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఉందంటున్నారు.

రెండు రోజుల ముందు ఒక ప్రముఖ చానెల్ ఇంటర్వ్యూ చేస్తే ఎన్ని జాబులు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు తెచ్చారు అని ప్రశ్నిస్తే.. సదురు వర్గాలు నోరెళ్ల బెట్టారని తెలిసింది. ‘మేము ఆ పనిలోనే ఉన్నామని.. చేస్తున్నామని’ తప్పించుకోవడం వైసీపీ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెట్టిందంటున్నారు. ఆ యాంకర్ ఎన్నిసార్లు సూటిగా ఇదే ప్రశ్న అడిగినా సమాధానం ఇవ్వలేకపోయారు.

వైసీపీలోని ఆ వర్గాల సమాధానాలు వైరల్ కావడంతో ఇక ఏపీలో ఇండస్ట్రీ పెరుగుదల ఎలా ఉంటుందని చదువుకున్న వాళ్లు అంటున్నారు. ప్రస్తుతం ఏపీఐఐసీ చైర్మన్ కానీ.. పరిశ్రమల శాఖ మంత్రికి కానీ ఏపీలో ఎన్ని పరిశ్రమలు.. ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారనే విషయంలో అవగాహన ఉందా లేదా అని నిరుద్యోగులు అడుగుతున్నారు. సోషల్ మీడియాలో ఊదరగొట్టేయడం తప్పితే చిత్తశుద్ధితో ఏపీలో పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన జరగడం లేదని వారంతా వాపోతున్నారు.