ఏపీ అధికారపక్షంలో హాట్ టాపిక్ గా మారిన ‘అంతర్గత సర్వే’

Thu Sep 23 2021 17:00:01 GMT+0530 (IST)

Internal survey becomes hot topic in AP bureaucracy

అధికారంలోకి రావటం ఒక ఎత్తు. వచ్చాక ప్రజల మనసుల్ని గెలుచుకోవటం మరో ఎత్తు. సాధారణంగా ప్రభుత్వాలు ఏవైనా సరే.. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అన్నది సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వమనే పెద్ద వ్యవస్థలో.. కొందరు సరిగా పని చేయకపోవటం.. మరికొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం లాంటివి చోటు చేసుకుంటాయి. కానీ.. వీటన్నింటి ఫలితాన్ని మాత్రం అనుభవించాల్సింది మాత్రం ప్రభుత్వాధినేత స్థానంలో ఉన్న వారే. అందుకే.. అధికారంలో ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మిగిలిన ముఖ్యమంత్రులతో పోలిస్తే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్రమత్తంగా ఉంటారని చెప్పాలి.సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ సర్కారు.. అధికారాన్ని చేపట్టి రెండున్నరేళ్లు అవుతోంది. అనూహ్య రీతిలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పుడు పెద్ద చర్చకు తెర తీస్తోంది. ఇదిలా ఉంటే.. పార్టీ నేతల తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ఎంపీ.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీల పని తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పని తీరు ఎలా ఉంది? అన్న విషయంతో పాటు మంత్రులు.. ఎంపీ.. ఎమ్మెల్యేల పని తీరుపై అభిప్రాయాల్ని సేకరించాలని ముఖ్యమంత్రి జగన్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే అంతర్గత సర్వే మొదలైంది. దీంతో.. ఇటీవల కాలంలో పార్టీ నేతలకు.. కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమితులైన వారు.. డైరెక్టర్లుగా ఎంపికైన వారి సెల్ ఫోన్లకు మెసేజ్ లు.. కాల్స్ వస్తున్నాయి. దీంతో.. అందరూ అప్రమత్తం అవుతున్నారు. ఇదంతా ప్రభుత్వం మీద పెరిగిన వ్యతిరేకత కారణంగా? అన్న ప్రశ్నకు కాదన్న మాట వినిపిస్తోంది.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా.. పెరిగే వ్యతిరేకతను కంట్రోల్ చేయాలన్నది అసలు ఉద్దేశంగా చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే.. జగన్ సర్కారులో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు నేరుగా అందేలా ప్లాన్ చేయటం.. ఇందులో స్థానిక నేతల ప్రమేయాన్ని తగ్గించేయటం.. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న అన్ని కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా అందరికి అందేలా చేయటంతో కొందరు కిందిస్థాయి నేతలు గుర్రుగా ఉన్నారు. ఇందుకు భిన్నంగా ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు.

పథకాల అమల్లో పార్టీలకు అతీతంగా వ్యవహరించిన తీరు జగన్ ప్రభుత్వానికి సానుకూలత వ్యక్తమవుతోంది. అయితే.. ప్రభుత్వం ఎన్ని పథకాల్ని అమలు చేసినా.. ఎన్నికల వేళలో తమ అవసరం తప్పనిసరి.. తాము పని చేయనిదే ఓట్లు పడటం కష్టమన్న మాటను కొందరు నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి భావన ఉందన్న విషయంతో పాటు.. పార్టీ నేతల తీరు ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత సర్వేను షురూ చేశారు. దీని ద్వారా వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా మిగిలిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

తమను నిర్లక్ష్యం చేస్తే.. 2024 ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోవటం కష్టమన్న మాటను పార్టీలో ప్రచారం చేస్తున్న దరిమిలా.. అలాంటి వాదనలో పన ఎంత ఉందన్న విషయాన్ని తేల్చాలని సర్వే చేస్తున్న వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుంచి పీకే టీం రంగంలోకి దిగనున్న నేపథ్యంలో.. ఆ లోపు ఇప్పటివరకు ప్రభుత్వంపై ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రభుత్వాధినేత కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. దీంతో.. పార్టీకి జరిగే మేలు ఎంత? కీడు ఎంత అన్న విషయంపై అవగాహన పెరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది.