తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు.. ప్రకటించేసిన సర్కారు

Wed Jun 09 2021 22:00:01 GMT+0530 (IST)

Inter examinations canceled in Telangana

తెలంగాణలో ఇప్పటి వరకు ఊగిసలాటగా ఉన్న ఇంటర్ మీడియెట్ సెకండియర్ పరీక్షలపై కేసీఆర్ సర్కారు స్పష్టత ఇచ్చింది. ఈ పరీక్షలను రద్దు చేస్తున్నామని.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా ప్రకటించారు. నిజానికి ఇప్పటి వరకు పదోతరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేశారు. దీంతో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై ఏం చేస్తారు?  నిర్వహిస్తారా?  లేదా? అనే సందేహాలు సర్వత్రా ముసురుకున్నాయి.దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత కూడా రాలేదు. నిజానికి మంగళవారం కేబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని అనుకున్నా.. ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. దీంతో ఇంటర్ పరీక్షలు ఉంటాయనే అనుకున్నారు. తదుపరి ఉన్నత చదువులకు అవసరమైన ఇంటర్ సెకండ్ ఇయర్ మార్కుల నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రుల్లోనూ ఒక విధమైన గందరగోళం నెలకొంది.

అయితే.. తాజాగా సీఎం కేసీఆర్‌తో ను అదేవిధంగా ఉన్నతాధికారులతోనూ పలుదఫాలుగా చర్చలు జరిపిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేసేందుకు మొగ్గు చూపారు. ఇదే విషయాన్ని ఆమె స్పష్టం చేస్తూ.. మీడియాకు వెల్లడించారు. అయితే.. పరీక్షలు రద్దు చేసినా.. విద్యార్థులకు మాత్రం మార్కులు ఇస్తామన్నారు. ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో సంపాయించుకున్న మార్కుల ఆధారంగా.. వీరికి మార్కులు కేటాయిస్తామని.. చెప్పారు.

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో విద్యార్థులకు మార్కులు కేటాయించే అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి సబిత తెలిపారు. ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదిక ఇస్తుందని.. అది రాగానే ఎలాంటి విధానంలో మార్కులు కేటాయించాలనేది స్పష్టత వస్తుందని తెలిపారు. అదేసమయంలో విద్యార్థులు కనుక పరీక్షలు నిర్వహించాలని కోరుకుంటే.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత.. దీనిపై ఆలోచించి వారికి అవకాశం కల్పిస్తామని కూడా మంత్రి తెలిపారు. మొత్తానికి విద్యార్థులకు సంకటంగా మారిన పరీక్షల నిర్ణయంపై కేసీఆర్ సర్కారు క్లారిటీ ఇవ్వడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.