ప్రియుడితో పెళ్లి కోసం తనలాంటి అమ్మాయిని చంపేసింది

Fri Mar 31 2023 10:03:07 GMT+0530 (India Standard Time)

Inspired by the TV serial she killed her friend to marry her boyfriend

మన సుఖం కోసం ఎదుటివారి ప్రాణాల్ని తీయటాన్ని ఎమనాలి? ఎలా చూడాలి? ఇంతకు మించిన ఆరాచకం.. పైశాచికం ఇంకేం ఉంటుంది. ఇప్పుడీ ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఆరాచకానికి పరాకాష్ఠ అన్నట్లుగా ఉండే ఈ ఉదంతం గురించి తెలిసిన తర్వాత మనసు మనసులో ఉండే అవకాశమే లేదు. ప్రియుడితో పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరన్న కారణంతో తనలా ఉండే స్నేహితురాలిని చంపేసి.. తాను చనిపోయినట్లుగా కలరింగ్ ఇచ్చిన ఒక దుర్మార్గ ప్రేమికురాలి ఉదంతం షాకింగ్ గా మారింది. ఈ దరిద్రపుగొట్టు ఆలోచనకు ఒక టీవీ సీరియల్ ప్రేరణ కావటం గమనార్హం.హర్యానా రాష్ట్రంలో దాదాపు ఆరేళ్ల క్రితం జరిగిన ఈ ఉదంతంలో తాజాగా నిందితురాలికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. హర్యానాలోని పానీపత్ కు చెందిన జ్యోతి క్రిష్ణలు ప్రేమికులు. వీరి ప్రేమ తెలిసిన తల్లిదండ్రులు.. వారు పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అన్నారు. దీంతో పారిపోయి పెళ్లి చేసుకుందామని ఆలోచించారు. కానీ.. కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఏం చేయాలన్న ఆలోచన చేసి.. ఒక దారుణమైన పథక రచన చేశారు. అది కూడా ఒక టీవీ సీరియస్ స్ఫూర్తితో.

ఇందులో భాగంగా 2017లో తనలా ఉండే తన స్నేహితురాలు సిమ్రన్ ను నకలవాలని పిలిచి జ్యోతి ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చింది. అనంతరం గొంతు కోసి చంపేశారు. సిమ్రన్ దుస్తుల్ని తీసేసి.. తన దుస్తులు తొడిగి.. తనకు చెందిన కొన్ని గుర్తింపు కార్డుల్ని పడేసిన ప్రేమికులు ఇద్దరూ.. వారి దారిన వారు వెళ్లిపోయారు. అనంతరం సిమ్రన్ డెడ్ బాడీని చూసిన పోలీసులు.. జ్యోతి గుర్తింపు కార్డులు ఉండటంతో ఆమె చనిపోయిందని భావించారు. జ్యోతి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పజెప్పి అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే.. తమ కుమార్తె కనిపించటం లేదని సిమ్రన్ తల్లిదండ్రలు ఫిర్యాదు చేయటం.. ఆమె ఫోటోను చూసిన పోలీసులకు కొత్త సందేహాలు కలిగాయి. అనుమానాస్పద రీతిలో మరణించిన యువతి ఫోటోలను నిశితంగా పరిశీలించగా.. ముక్కుపుడక ఆధారంగా ఆమె సిమ్రన్ అని గుర్తించారు. దీంతో.. జ్యోతి.. క్రిష్ణలను పట్టుకునే క్రమంలో వారిని సిమ్లాలో అరెస్టు చేశారు. 2020లో అదుపులోకి తీసుకున్న అనంతరం.. క్షయ వ్యాధితో క్రిష్ణ జైల్లో మరణించాడు. తాజాగా కోర్టు విచారణ ముగిసి.. నేరం నిరూపితం కావటంతో జ్యోతికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ జడ్జి తీర్పును ఇచ్చారు. ఏ ప్రేమ కోసం ఇంత దారుణాలకు పాల్పడ్డారో అవేమీ లేకపోవటమే కాదు.. ఎన్ని కుటుంబాలు విషాదంలో మునిగిపోయేలా చేశారో ఈ ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.