'పవర్' చూపించిన భారత బాక్సర్లు.. ఫైనల్ కు నలుగురు

Fri Mar 24 2023 09:28:59 GMT+0530 (India Standard Time)

Indian Boxers Script History As All Four To Finals Of World Championship

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో మనమ్మాయిలు నలుగురు ఫైనల్లోకి దూసుకుపోయిన వైనం ఆసక్తికరంగా మారింది.ఆ నలుగురిలో హైదరాబాదీ నిఖత్ జరీన్ ఒకరు. 48 50 75 81 కేజీల విభాగంలో దేశానికి చెందిన మహిళా బాక్సర్లు తమ ప్రత్యర్థులపై విసిరిన పవర్ ఫుల్ పంచ్ లతో వారు ఫైనల్ కు చేరుకున్నారు. పసిడి రేసులో ముందున్నారు.గురువారం జరిగిన సెమీ ఫైనల్స్ లో నిఖత్ జరీన్ చేతిలో 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత కొలంబియాకు చెందినఇన్ గ్రిత్ వలెన్సియా ఓడిపోగా.. నీతూ చేతిలో ఆసియా చాంపియన్ అయిన కజికిస్తాన్ కు చెందిన అలువా బల్కిబెకోవా ఓడారు. ఒక లవ్లీనా చేతిలో చైనాకు చెందిన లీ కియాన్.. స్వీటీ చేతిలో ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా గ్రీన్ ట్రీ ఓటమిపాలయ్యారు. దీంతో.. ఫైనల్ కు మన దేశానికి చెందిన నలుగురు మహిళా బాక్సర్లు చేరారు.

ఒక ప్రపంచ చాంపియన్ షిప్ లో నలుగురు అంత కంటే ఎక్కువమంది భారత బాక్సర్లు ఫైనల్ కు చేరటం ఇది రెండోసారిగా చెబుతుననారు. 2006లో న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో ఐదుగురు భారత బాక్సర్లు ఫైనల్ కు చేరగా.. ఆ తర్వాత మళ్లీ నలుగురు ఫైనల్ కు చేరిన ఉదంతం ఇదేనని చెబుతున్నారు. ఈ రోజు విశ్రాంతి దినం కాగా.. ఫైనల్ పోటీలు శని.. ఆదివారాలు జరగనున్నాయి. శనివారం సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఫైన్ లో నీతూ మంగోలియాకు చెందిన లుత్సయిఖాన్ తో పోటీపడనుంది.చైనాకు చెందిన లీనా వాంగ్ తో స్వీటీ రింగులోకి దిగనుంది.

ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే ఫైనల్ పోటీలో వియత్నాంకు చెందిన ఎన్గుయెన్ థి టామ్ తో హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ బరిలోకి దిగనుంది. ఇక.. మరో ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్ తో లవ్లీనా పోటీ పడనున్నారు. మనమ్మాయిలు నలుగురు ఫైనల్ పోరులో విజయం సాధించి.. బంగారుపతకాలతో భారతీయులందరిని మురిసిపోయేలా చేస్తారని ఆశిద్దాం.