Begin typing your search above and press return to search.

న్యాయం కోసం గళం విప్పితే నడి రోడ్డు మీద ఈడ్చుకెళతారా మోడీ?

By:  Tupaki Desk   |   29 May 2023 10:40 AM GMT
న్యాయం కోసం గళం విప్పితే నడి రోడ్డు మీద ఈడ్చుకెళతారా మోడీ?
X
నీతి బోధలు చేయటం నరేంద్ర మోడీకి వచ్చినంత బాగా మరెవరికీ రాదేమో. యావత్ దేశానికి సుద్దులు చెప్పిన ఆయన.. అదే సమయంలో దేశ రాజధానిలో మరో దారుణ ఉదంతంచోటు చేసుకుంది. కొత్త పార్లమెంట్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన మోడీ.. ప్రజాస్వామ్య విలువలు మొదలు కొని ఎన్నో నీతిబోధలు చేశారు. అలాంటి పెద్ద మనిషి తన ప్రసంగం చేసిన గంటల వ్యవధిలోనే.. ఒలింపిక్ విజేతలుగా దేశానికి వన్నె తెచ్చిన రెజ్లర్లను నడిరోడ్డు మీద పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లిపోవటం ఏమిటి?

మోడీ చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉండదన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి. తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాల్పడే బీజేపీ ఎంపీ కమ్ జాతీయ రెజ్లర్ల సంఘానికి రథసారధిగా వ్యవహరిస్తున్న బ్రిజ్ భూషన్ తీరును తప్పు వారాల తరబడి ఢిల్లీలో శాంతియుతంగా నిరసనలు.. ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆదివారం వారంతా జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు మార్చ్ ను నిర్వహించారు. ఈ మార్చ్ లో అంతర్జాతీయ క్రీడాకారులు వినేశ్ ఫొగాట్.. సాక్షి మాలిక్.. బజ్ రంగ్ పునియాలను పోలీసులు అడ్డుకోవటమే కాదు.. వారిని నిర్బంధించి.. నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు.

ప్రజాస్వామ్య భారతంలో నిరసన తెలిపే హక్కు ఉంది. నీతి ప్రవచనాలు బోధించే నరేంద్ర మోడీ లాంటి వారు.. మాటల్లో తప్పించి చేతల్లో ఈ తీరును అస్సలు హర్షించరు. అందుకు తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. అంతర్జాతీయ క్రీడాకులైన రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. వారిని.. రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్లిన వైనాన్ని చూసినోళ్లంతా ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

బ్రిజ్ భూషన్ ను వెంటనే అరెస్టు చేయాలని.. పోలీసులు అదుపులోకి తీసుకున్న క్రీడాకారుల్ని విడుదల చేయాలని.. రెజ్లర్లపై చేయి చేసుకున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న క్రీడాకారులపై కనికరం లేకుండా అణిచి వేయటాన్ని తప్పు పట్టిన ప్రియాంక వాద్రా.. బీజేపీ ప్రభుత్వానికి అహంకారం ఎక్కువైందన్నారు.

దేశ గౌరవాన్నిపెంచేలా చేసిన క్రీడాకారుల పట్ల ఇంతటి దురుసుతనం తప్పని.. ఇది తీవ్రంగా గర్హనీయమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనగా.. వినేశ్ ఫొగాట్.. సాక్షి మాలిక్ లపై ఢిల్లీ పోలీసులు చేయి చేసుకోవటంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం సహనంగా ఉందని.. అణిచివేత శక్తులు మాత్రం అసహనంతో ఉన్నాయన్నారు. మహిళా క్రీడాకారులపై చేయి చేసుకోవటానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందా? అని ఎన్సీపీ నేత సుప్రియా సూల్ ప్రశ్నించారు.

మహిళా రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. తమపట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన అమానుష వైఖరిని కళ్లకు కట్టినట్లుగా చెప్పేందుకు వీలుగా ఒక వీడియోను ఆమె షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారెందుకు? ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.