Begin typing your search above and press return to search.

ఐరాస భద్రతామండలిలో భారత్ విజయం!!

By:  Tupaki Desk   |   18 Jun 2020 4:15 AM GMT
ఐరాస భద్రతామండలిలో భారత్ విజయం!!
X
ఐక్యరాజ్య సమితిలో భారత్ మరోసారి విజయం సాధించింది. ఆసియా - పసిఫిక్ కేటగిరీలో నిర్వహించిన ఎన్నికల్లో భారత్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. చైనా, పాకిస్తాన్ సహా ఇక్కడి దేశాలన్నీ భారత్‌కే అనుకూలంగా ఓటు వేశాయి. దీంతో 2021-22 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితిలో మనదేశం నాన్-పర్మినెంట్ సభ్యదేశంగా కొనసాగుతుంది. ఈ సభ్యత్వ కాలం ముగిసిన తర్వాత మరోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. నాన్-పర్మినెంట్ సభ్యదేశంగా జరుగుతున్న ఎన్నికల్లో భారత్ విజయం సాధించడం ఇది ఎనిమిదోసారి.

యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ((UNSC)లో ఆసియా-పసిఫిక్ కేటగిరీలో జరిగిన ఎన్నికల్లో బుధవారం రాత్రి (జూన్ 17) భారత్ విజయం సాధించింది. 193 సభ్యులు కలిగిన జనరల్ అసెంబ్లీలో గెలుపొందేందుకు 128 ఓట్లు కావాలి. కానీ భారత్‌కు 184 ఓట్లు వచ్చాయి. 8 చెల్లని ఓట్లుగా ప్రకటించారు. గతంలో భారత్ 1950-1951 - 1967-1968 - 1972-1973 - 1977-1978 - 1984-1985 - 1991-1992 - 2011-2012 విజయం సాధించింది.

భారత్ తరఫున నాన్-పర్మినెంట్ మెంబర్‌ గా టీఎస్ తిరుమూర్తి ప్రాతినిథ్యం వహిస్తారు. ఐక్యరాజ్య సమితిలో ఆయన భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆసియా-పసిఫిక్ సహా వేర్వేరు కేటగిరీలలో నిర్వహించిన ఎన్నికల్లో ఐర్లాండ్ - మెక్సికో - నార్వే విజయం సాధించాయి. ఈ దేశాలన్ని నాన్-పర్మినెంట్ సభ్యదేశాలుగా ఉంటాయి. కెనడా పోటీ చేసి ఓడిపోయింది. మొత్తం 10 నాన్-పర్మినెంట్ దేశాల కోసం ఎన్నికలు నిర్వహిస్తారు.

ఈ పది స్థానాల్లో అయిదు సీట్లు ఆసియా - ఆఫ్రికా దేశాలకు - లాటిన్ అమెరికా - కరేబియన్ ద్వీపదేశాలు - పశ్చిమ యూరోప్ - తూర్పు యూరోప్ దేశాలకు మిగతా స్థానాలు కేటాయిస్తారు. ఎన్నికైన దేశాలు భద్రతా మండలిలో తమ గళం వినిపించాలి. భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉంటాయి. 5 పర్మినెంట్ (అమెరికా - యునైటెడ్ కింగ్‌ డమ్ - ఫ్రాన్స్ - రష్యా - చైనా) ఉంటాయి. 10 నాన్-పర్మినెంట్ దేశాలు ఉంటాయి.