Begin typing your search above and press return to search.

కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న ఇండియా

By:  Tupaki Desk   |   25 Sep 2021 2:30 PM GMT
కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న ఇండియా
X
దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు మెరుగైన స్థాయికి చేరింది. ప్ర‌స్తుతం అది 97.78గా నమోదైంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇది అత్యంత మెరుగైన రిక‌వ‌రీ రేటు గ‌మ‌నార్హం. స‌రిగ్గా మార్చి నుంచినే దేశంలో సెకెండ్ వేవ్ క‌రోనా విజృంభించింది. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో రిక‌వ‌రీ రేటు క్ర‌మంగా ప‌డిపోయింది. ఒక ద‌శ‌లో రిక‌వ‌రీ రేటు క్షీణించింది. యాక్టివ్ కేసుల లోడు 15 ల‌క్ష‌ల వ‌ర‌కూ చేరిపోయింది. ఆ స‌మ‌యంలో రిక‌వ‌రీ రేటు బాగా త‌క్కువ‌గా న‌మోదైంది.

ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య మూడు ల‌క్ష‌ల స్థాయిలో ఉంది. ప్ర‌భుత్వ అధికారిక గ‌ణాంకాల ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో 3,36,24,419 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. వీరిలో 3,28,77,319 మంది రిక‌వ‌రీ అయ్యారు. దీంతో రిక‌వ‌రీ రేటు 97.78గా నిలుస్తోంది. సెకెండ్ వేవ్ ప్ర‌బ‌లిన త‌ర్వాత ఇది అత్యంత మెరుగైన రేటు కావ‌డంతో.. సెకెండ్ వేవ్ దాదాపు ముగిసిన‌ట్టే అని ప‌రిగ‌ణించాలేమో!

సెకెండ్ వేవ్ కు ముందు స‌రిగ్గా ఇదే స్థాయి నుంచినే రిక‌వ‌రీ రేటు క్షీణిస్తూ వ‌చ్చింది. ఇప్పుడు సెకెండ్ వేవ్ పూర్వ‌పు ప‌రిస్థితికి క్ర‌మంగా చేరుకుంటోంది ఇండియా. ప్ర‌స్తుతం రోజువారీ కేసుల సంఖ్య 30 వేల స్థాయిలో వ‌స్తున్నాయి. ఇందులో కూడా మెజారిటీ వాటా కేర‌ళ నుంచినే న‌మోద‌వుతున్నాయి. ప్ర‌స్తుతం అక్క‌డ కూడా కేసుల సంఖ్య కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది.

మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ ఊపందుకుంటోంది. దాదాపు 23 శాతం మందికి పైనే రెండు డోసుల వ్యాక్సినేష‌న్ జ‌రిగిన‌ట్టుగా కేంద్ర ప్ర‌భుత్వ గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ శాతం మెరుగ‌య్యే కొద్దీ ప్ర‌జ‌ల్లో ఇమ్యూనిటీ మ‌రింత మెరుగ‌వుతుంద‌ని ప‌రిశోధ‌కులు అంచ‌నా వేస్తూ ఉన్నారు. స్థూలంగా కోవిడ్-19 సెకెండ్ వేవ్ నుంచి ఇండియా క్ర‌మంగా కోలుకుంటోందని గ‌ణాంకాలు స్ప‌ష్ట‌త‌ను ఇస్తున్నాయి.