Begin typing your search above and press return to search.

వరస్ట్ లోకి వెళుతున్నాం..గంటకు కొత్త కేసులెన్ని? మరణాలు ఎన్నంటే?

By:  Tupaki Desk   |   6 July 2020 3:45 AM GMT
వరస్ట్ లోకి వెళుతున్నాం..గంటకు కొత్త కేసులెన్ని? మరణాలు ఎన్నంటే?
X
మిగిలిన వారితో పోలిస్తే ముందే కళ్లు తెరిచినా.. పెద్ద ఎత్తున లాక్ డౌన్ అమలు చేసినా.. మహమ్మారి పడగ నీడ నుంచి తప్పించుకోలేని దుస్థితి. ఎప్పుడైతే లాక్ డౌన్ సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారో.. అప్పటి నుంచి పాజిటివ్ కేసుల పరంపర అంతకంతకూ పెరుగుతూ ఉంది. అది కాస్తా ఇప్పటికి మరింత దూసుకెళుతూ దడ పుట్టిస్తోంది. మే ముందు వరకు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యే దేశాల జాబితాలో లేని భారత్.. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన మొదటి ఐదు స్థానాల్లో ఒకటిగా మారటం గమనార్హం.

అడ్డూ అదుపు లేకుండా నమోదవుతున్న పాజిటివ్ కేసులతో ఇరవైనాలుగు గంటల వ్యవధిలో కాస్త తక్కువగా పాతికవేల కేసులు నమోదు కావటం చూస్తే.. మహమ్మారి ఎంతలా చెలరేగిపోతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తాజా కేసులతో భారత్ లో నమోదైన మొత్తం కేసులు ఏకంగా 6.73లక్షలు. ఈ రోజుతో రష్యాను దాటేసి.. టాప్ త్రీ పొజిషన్ లోకి వచ్చేయనుంది. ఇక.. మన ముందు ఉన్నది బ్రెజిల్.. అమెరికానే. ఇప్పుడున్న దూకుడు కొనసాగితే మరో వారం.. పదిరోజుల్లో బ్రెజిల్ ను దాటేయటం ఖాయం. ఇక.. అమెరికాను అంటారా? ఈ నెలాఖరకు.. లేదంటే వచ్చే నెల మొదటి వారానికి ఆ దరిద్రపుగొట్టు రికార్డు మన సొంతం కావటం ఖాయం.

తాజాగా నమోదైన కేసుల పరంపరను చూస్తే.. కేవలం 24 గంటల వ్యవధిలో నమోదైన కేసుల్ని గంటలకు కుదిస్తే.. ప్రతి గంటకు1035 కేసులు నమోదయ్యాయి. అంటే.. ప్రతి నిమిషానికి 17 కేసులకు పైనే నమోదు కావటం చూస్తే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. మరింత సూక్ష్మంగా విశ్లేషిస్తే.. ప్రతి మూడు సెకన్లకు ఒక కొత్త కేసు నమోదయ్యే దుస్థితి.. ప్రతి రెండున్నర నిమిషాలకో మరణం మహమ్మారి కారణంగా భారత్ లో చోటు చేసుకుంది. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరగనుంది.

రాష్ట్రాల వారీగా వస్తే.. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర టాప్ లో నిలిచింది. ఒక్కరోజులో ఆ రాష్ట్రంలో 7074 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 70 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనేనమోదు కావటం గమనార్హం. మహారాష్ట్ర.. ఢిల్లీ.. గుజరాత్.. తమిళనాడు.. ఉత్తరప్రదేశ్ లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో నమోదైన కేసుల్ని.. మన దేశంలోని పలురాష్ట్రాలు దాటేస్తున్నాయి. మహారాష్ట్ర విషయానికి వస్తే.. జర్మనీ దేశంలో నమోదైన కేసుల్ని ఆ రాష్ట్రం దాటేసింది. కెనడాను తమిళనాడు దాటేస్తే.. కతర్ ను ఢిల్లీ దాటేసింది. ఇదంతా చూసినప్పుడు దేవుడా.. అనుకోకుండా ఉండలేం. చూస్తుంటే.. రానున్న నెల రోజులు మరింత కీలకమని చెప్పక తప్పదు.