వామ్మో : ఆ పుకార్లలో కూడా మనమే టాప్ !

Thu Sep 16 2021 15:00:18 GMT+0530 (IST)

India is at the top in creating rumors

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వాడకం రోజురోజుకు పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమయంలో అటు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు కూడా రోజురోజుకు ఎక్కువగా అవుతున్నాయి. ప్రతి రోజూ ఎన్నో రకాల తప్పుడు వార్తలు వైరల్ గా మారిపోతున్నాయి. ఈ వార్తలు చూస్తుంటే ఏది నిజమో ఏది అబద్ధమో కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో అయితే ఎన్నో రకాల పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేసాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.అప్పటికే కరోనా వైరస్ పేరెత్తితే చాలు దేశ ప్రజానీకం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వణికిపోయింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ గురించి తెలుసుకునేందుకు చాలామంది సోషల్ మీడియాను ఆశ్రయించారు అనే చెప్పాలి ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో ఎన్నో తప్పుడు వార్తలు వైరల్ గా మారిపోయాయి. ఎంతో మంది పుకార్లు పుట్టించి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేశారు. ఇక కరోనా వైరస్ భయాలను మరింత పెంచే విధంగా సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో రకాల పుకార్లు పుట్టుకు వచ్చాయి. ఇక ఆ తర్వాత వ్యాక్సిన్ విషయంలో కూడా సోషల్ మీడియాలో ఎన్ని రకాల తప్పుడు వార్తలు వైరల్ గా మారిపోయాయో అందరికీ తెలిసిందే.

ఇక ఇలాంటి పుకార్లను చూసినప్పుడు కేవలం ఇండియాలోనే ఈ రేంజ్ లో పుకార్లు క్రియేట్ చేస్తారా ఇతర దేశాల్లో కూడా ఇలాగే ఉంటుందా అని అందరికీ అనుమానం వచ్చే ఉంటుంది. అయితే ఇతర దేశాలతో పోల్చి చూస్తే మాత్రం పుకార్లు సృష్టించడంలో ఇండియానే టాప్ లో ఉంది అనే విషయాన్ని ఇటీవల ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది . ఇంటర్నెట్ సోషల్ మీడియా వినియోగంతో పాటు వాటి పైన సరైన అవగాహన లేకపోవడం వల్లే భారత ప్రజలందరూ ఇలా తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారు అన్న విషయం తేలింది. మొత్తంగా 130 దేశాలలో ఇలా అసత్య ప్రచారాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అనే దానిపై సర్వే నిర్వహించగా 18.07 శాతం భారత్లోనే అసత్య ప్రచారాలు పుట్టుకు వస్తున్నాయి అన్న విషయం తేలింది.