Begin typing your search above and press return to search.

ఆ ఇష్యూలో మాత్రం అమెరికా.. చైనా కంటే మనమే నెంబర్ వన్

By:  Tupaki Desk   |   31 July 2021 5:34 AM GMT
ఆ ఇష్యూలో మాత్రం అమెరికా.. చైనా కంటే మనమే నెంబర్ వన్
X
విషయం ఏదైనా కానీ.. ప్రపంచంలో టాప్ ఫైవ్ స్థానాల్లో చూస్తే.. అయితే అమెరికా.. లేదంటే చైనాలు కనిపిస్తాయి. అలా అని మానవ హక్కుల విషయంలోనో.. మీడియా హక్కుల్ని కాపాడే విషయంలోనో.. ఆనందకర జీవితాల్ని గడిపే ఇండెక్సులో మాత్రం కాదు. సాధారణంగా డిజిటల్ చెల్లింపులు అన్నంతనే అమెరికా.. చైనాల వైపు చూస్తాం. మన కంటే వారు సాంకేతికంగా అడ్వాన్స్ డ్ గా ఉంటారని భావిస్తాం. అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్న విషయం తాజాగా వెల్లడైంది. ఇదే విషయాన్ని కేంద్ర ఐటీ మంత్రి స్వయంగా వెల్లడించటం ఆసక్తికరంగా మారింది.

డిజిటల్ ట్రాన్సాక్షన్లు విషయంలో అమెరికా.. చైనాల్ని వెనక్కి నెట్టిన భారత్.. ప్రపంచంలోనే అత్యధిక చెల్లింపులు జరిపిన దేశంగా నిలిచింది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. 2020లో భారత్ లో 25.4 బిలియన్ల డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరిగాయని.. అదే సమయంలో చైనాలో 15.7 బిలియన్లు.. అమెరికాలో 1.2 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగినట్లుగా పేర్కొన్నారు.

ఆయన చెప్పిన గణాంకాల్ని చూస్తే.. చైనాతో పోలిస్తే 1.6రెట్లు ఎక్కువగా ఉంటే.. అమెరికాతో పోల్చినప్పుడు మాత్రం ఏకంగా 21 రెట్లు ఎక్కువగా ట్రాన్సాక్షన్లు జరగటం విశేషం. కేంద్రమంత్రి చేసిన ట్వీట్ ను పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తాజాగా షేర్ చేశారు. కేంద్రమంత్రి షేర్ చేసిన పోస్టులో ‘విశ్వగురు ఇన్ డిజిటల్ ట్రాన్సాక్షన్’ అంటూ పేర్కొన్న వైనం అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ గణాంకాల్ని అందించిన వారెవరన్నది చూస్తే.. రిజర్వు బ్యాంక్ ఇండియా.. డిజిటల్ పేమెంట్స్ ఇండెక్సు ఈ విషయాల్ని వెల్లడించింది.

ఒకప్పుడు డిజిటల్ పేమెంట్స్ అన్నంతనే ఉలిక్కిపడిన భారత్ లో.. పేటీఎం ఒక కొత్త చరిత్రను షురూ చేసిందని చెప్పాలి. తర్వాతి కాలంలో వచ్చిన ఫోన్ పే.. గూగుల్ పే లాంటివెన్నో వచ్చాయి. అంతకంతకూ పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు మరింత పెరగటానికి కరోనా కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.

ఈ వాదనను బలపరిచేలా తాజా గణాంకాలు ఉన్నాయి. 2019 మార్చి నాటికి 153.47 కోట్ల చెల్లింపులు జరగ్గా.. 2020 మార్చి నాటికి 207.84 కోట్లకు చేరుకున్నాయి. మరో ఏడాది పూర్తి అయ్యేసరికి (2021 మార్చి) అవి కాస్తా ఏకంగా 270.59 కోట్లకు పెరగటం గమనార్హం. ఇదంతా చూస్తే.. డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు ఏ స్థాయిలో పెరిగిపోతున్న విషయం అంకెలు చెప్పేస్తున్నాయని చెప్పొచ్చు. మరిన్ని వసతులు.. సర్వీసు కల్పించాలే కానీ డిజిటల్ చెల్లింపులు మరింత ఎక్కువగా జరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది.