Begin typing your search above and press return to search.

కేసీయార్ జగన్ ల పాపులారిటీ ఇలా జారిపోతూంటే ...?

By:  Tupaki Desk   |   30 Jan 2023 7:00 AM GMT
కేసీయార్ జగన్ ల పాపులారిటీ ఇలా జారిపోతూంటే ...?
X
ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు జాతీయ జాబితాలో సర్వేలలో మాత్రం సోదిలోకి రాకుండా పోయారా. ఆ విషయంలో కేసీయార్ కంటే కొంచెం  జగన్   బెటరా. దేశంలో చాలా మంది సీఎంల కంటే తెలుగు సీఎంలు ఎందులో వెనకబడ్డారు. వారికి ఏమి తక్కువ. అంటే ఇండియా టూడే మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ జరిపిన ఒక సర్వేలో పాపులారిటీ విషయంలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు బాగా వెనకబడ్డారు.

ఇక టాప్ టెన్ లో పదవ స్థానంలో అయినా జగన్ ఉన్నారు కానీ కేసీయార్ మాత్రం అదీ లేదు. అంటే కేసీయార్ లాంటి జాతీయ నేతలు ఎంతటి అవమానం అన్న సెటైర్లు పడుతున్నాయి. విషయానికి వస్తే ఇండియా టూ డే మోస్ట్ పాపులర్ సీఎం  అన్న సర్వేను జరిపితే రాష్ట్రాల వారీగా చూస్తే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో ఉన్నారు. రెండవ స్థానంలో ఢిల్లీ సీఎం ఉన్నారు. మూడవ ప్లేస్ లో అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఉన్నారు.

ఆ మీదట వరసగా చూస్తే చత్తీస్‌గఢ సీఎం భూపేష్‌ భఘెల్, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ ధామి, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు. ఇక చిట్ట చివరన టాప్‌ టెన్‌ప్లేసులో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఉన్నారు. చిత్రంగా ఈ జాబితాలో కేసీయార్ పేరు ఎక్కడా లేదు అంటే మారీ దారుణం అని అనుకోవాలేమో. ఇలా రాష్ట్రాల వారీగా సర్వే చేస్తే ఈ ర్యాంకింగ్స్ వచ్చాయి.

ఇదే విధంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రి కేటగిరీని ఎంచుకోమంటే ఫస్ట్ ప్లేస్ లోకి యూపీ సీఎం యోగీ వచ్చారు. ఆ తరువాత  స్థానమలొ  కేజ్రీవాల్‌ నిలిచారు. ఇక వరుసగా మమతాబెనర్జీ, స్టాలిన్, నవీన్‌ పట్నాయక్, హిమంత బిశ్వశర్మ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, ఏకనాథ్‌షిండే, జగన్‌మోహన్‌రెడ్డి, భూపేష్‌ భఘెల్‌ ఉన్నారు. మరి ఈ లిస్ట్ లో కూడా కేసీయార్ లేడు. జగన్ ప్లేస్ అయితే తొమ్మిదవ ర్యాంకింగ్ కి వెళ్ళింది. ఇదే జగన్ విషయం తీసుకుంటే గతంలో చేసిన సర్వేలలో తొలి అయిదు స్థానాలలో ఉండేది.

 ఇపుడు టాప్ టెన్ అంటే అక్కడే ఆయన ఉన్నారు. మరి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ ర్యాంకింగ్ ఇలా డౌన్ కావడం విశేషమే. అదే టైంలో బంగారు తెలంగాణా సాధించాను, ఇక తిరుగులేదు అనుకుంటూ కేంద్రంలోని మోడీ సర్కార్ ని పడగొడతాను అని వెళ్తున్న కేసీయార్ ఉత్తమ సీఎం గా టాప్ టెన్ లో అయినా ఎక్కడో ఒక చోట ర్యాంక్ సాధించుకోలేదంటే నోళ్ళు వెళ్లబెట్టాల్సిందే.

మరి తెలంగాణా మోడల్ అంటూ కేసీయార్ దేశానికి చెప్పబోతున్నారు. ఇక్కడ అంతా చేశాను ఇక దేశంలో చేసి చూపిస్తాను అని ఆయన అంటున్నారు. అదేమీ ఈ సర్వే చేసిన వాళ్లకు కనబడలేదా జనాలకు వినబడలేదా అన్న డౌట్ వస్తోంది. జగన్ విషయం తీసుకుంటే మరోసారి సీఎం ఆయనే అని వైసీపీ వారు అంటున్నరు. వై నాట్ 175 అని ఆయన అంటున్నారు. ఏ ఏటికి ఆ ఏడు పాపులారిటీ ఇలా జారిపోతూంటే ఇవనీ ఎలా జరుగుతాయని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు జవాబు వారి పార్టీ వద్ద ఉందో లేదో. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల సీఎంలు తన పూర్ పెర్ఫామెన్స్ తో అందరికీ షాక్  ఇచ్చేశారు అని అంటున్నారు.