Begin typing your search above and press return to search.

జనం చేతిలో డబ్బు లేదు..దేశం సంక్షోభంలోకేనా?

By:  Tupaki Desk   |   26 May 2020 12:30 AM GMT
జనం చేతిలో డబ్బు లేదు..దేశం సంక్షోభంలోకేనా?
X
యావత్తు ప్రపంచ దేశాలను లాక్ డౌన్ లోకి నెట్టేసిన ప్రాణాంతక వైరస్ కరోనా.. భారత్ ఏకంగా సంక్షోభంలోకి నెట్టేసే దిశగా సాగుతోందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా విస్తరణ నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ అమల్లోకి రాగా... జనం చేతిలో డబ్బు లేకుండా పోయింది. ఫలితంగా వినియోగ డిమాండ్ భారీగా పడిపోగా... అది రికవరీ అయ్యేందుకు చాలా సమయమే పడుతుందట. ఫలితంగా దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేయబడుతోందా? అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ ఓ నివేదికను విడుదల చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో పడకేసిన ఉత్పత్తి రంగానికి కొత్త ఊపిరిలూదుతుందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ ఏ మేర సత్ఫలితాలనిస్తుందన్న దానిపై ఆర్థిక సంక్షోభం ఆధారపడి ఉంటుందని కూడా ఆ సంస్థ తెలిపింది.

రూ.20 లక్షల కోట్లతో కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించినా... ఈ ప్యాకేజీలోని అన్ని ఉద్దీపనలూ జనం చేతిలోకి డబ్బు వచ్చేవి కావని, ఈ కారణంగా ప్యాకేజీ ఘనంగానే ఉన్నా జనం చేతిలో డబ్బు రావడం లేదని డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ ఛీఫ్ ఎకానమిస్ట్ అరుణ్ సింగ్ వాదిస్తున్నారు. జనం చేతిలోకి డబ్బు రాకుంటే... వినియోగ డిమాండ్ పెరిగేదెలా? అని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే భారీ ప్యాకేజీ వల్ల ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ అయితే సాధ్యపడుతుందని - అయితే సాధారణ పరిస్థితులు ఎప్పటికి ఏర్పడతాయన్న దానిపై మాత్రం ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జనం చేతిలోకి డబ్బు రాకపోవడంతో డిమాండ్ బలహీనంగానే ఉంటుందని - అయితే కొంతకాలం తర్వాత పరిస్థితి మెరుగుపడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా కేసులు ఇంకా పెరుగుతుండటంతో ప్రజల ఆదాయం కోల్పోవడంతో పాటుగా ఉద్యోగాలను కోల్పోతున్నారని - వినియోగ కార్యకలాపాలు మందగించడంతో మాంద్యం ముప్పు పొంచే ఉందని కూడా డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ తెలిపింది. ఈ క్రమంలో మొండి బకాయిలు పెరిగే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేసిన ఆ సంస్థ... ఈ పరిణామం బ్యాంకింగ్ రంగాన్ని మరింత ఒత్తిడికి గురి చేయవచ్చని తెలిపింది. ఆదాయం తగ్గిన నేపథ్యంలో వినియోగదారులు కొనుగోళ్లు - ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. అయితే వడ్డీ రేట్ల తగ్గుదల - మారటోరియం పొడిగింపు అంశాలు కాస్తంత ఉపశమనం కలిగించే అంశాలేనని ఆ సంస్థ తెలిపింది. మొత్తంగా జనం చేతిలో డబ్బు లేకపోతే.. దేశం సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం లేకపోలేదన్న చేదు నిజాన్ని ఆ సంస్థ బహిర్గతం చేసింది.