ఇండియా కరోనా: రోజురోజుకు తగ్గుతున్న కొత్త కేసులు.. భారీగా మరణాలు

Sat Jan 29 2022 21:00:02 GMT+0530 (IST)

India Corona New cases are decreasing day by day  Massive deaths

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా కొత్త కేసులు మూడు లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా 17 లక్షల మంది వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 235532 మందికి పాజిటివ్ గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 15 శాతం నుంచి 13.39 శాతానికి తగ్గిపోయింది. అయితే పలు రాష్ట్రాల్లో వైరస్ ఉధృతిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ కేరళలో మాత్రం మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే అక్కడ 54537 మందికి కరోనా సోకింది.కరోనా కేసులు తగ్గుతోన్న సమయంలో మరణాల్లో మాత్రం భారీ పెరుగుదల కనిపిస్తోంది.  అంతకుముందు రోజు 627 మరణాలు నమోదు కాగా.. నిన్న 871 మరణాలు సంభవించాయి. అందులో 352 కేరళ నుంచి వచ్చినవే. ఈ రాష్ట్రం మునుపటి  గణాంకాలను సవరిస్తుండడంతో ఆ తేడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహారాష్ట్రలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు.  అక్కడ సెప్టెంబరు తర్వాత ఆ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ఈ రెండేళ్లలో 493198 మంది మహమ్మారికి బలయ్యారు.

ప్రస్తుతం రికవరీలు పెరుగుతుండడంతో క్రియాశీల  కేసులు తగ్గుతున్నాయి. నిన్న 335939 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 93.99 శాతానికి చేరింది. క్రియాశీల కేసులు 20 లక్షలకు తగ్గగా.. ఆ కేసుల రేటు 5 శాతం దిగువకు పడిపోయింది. ఇప్పటివరకూ 40858241 మందికి కరోనా సోకగా.. 38360710 మంది వైరస్ ను జయించారని కేంద్రం వెల్లడించింది.

ఇక నిన్న 56 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకూ పంపిణీ అయిన డోసుల సంఖ్య 165 కోట్ల మార్క్ దాటింది. 15 ఏళ్లుపైబడిన టీనేజర్లకు తొలి డోసు ముప్పు పొంచి ఉన్న వర్గాలకు ప్రికాషనరీ డోసు ఇస్తుండడం.. మూడో దశలో వైరస్ తీవ్రతను తగ్గించిందని ఇటీవల ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డారు.