పాత సచివాలయంలో ఉండి.. కొత్త సచివాలయంలో మిస్ అయ్యేదేమంటే?

Wed Jul 08 2020 15:30:24 GMT+0530 (IST)

In the old secretariat What is a miss in the new secretariat?

తెలంగాణ సచివాలయం స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నకు వచ్చే సమాధానం.. తాజా అవసరాలకు వీలుగా లేకపోవటం. అవసరమైన స్థలం లేకపోవటం.. ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించాలంటే వసతి లేకపోవటం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే అంశాల్ని చెబుతుంటారు. సాధారణంగా పాతదాని స్థానంలో కొత్తది నిర్మిస్తున్నారంటే.. పాత దానిలోని లోపాల్ని చక్కదిద్దుకొని కొత్తదాన్లో అలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తుంటారు.మరి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు నిర్మిస్తున్న కొత్త భవనానికి సంబంధించి ఒక కీలక అంశం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. పాత సచివాలయంలో ఉన్న స్థలభావం.. కొత్త సచివాలయంలోనూ తీరేలా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త సచివాలయానికి సంబంధించిన నమూనాను విడుదల చేసిన వేళ.. సచివాలయంలో ఏమేం ఉండనున్నాయి? అన్న విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఇందులో ఒక ఆశ్చర్యకరమైన అంశం బయటకు వచ్చింది.

తాజాగా కూల్చేస్తున్న సచివాలయ భవనాలు 9.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉండేవి. మూడున్నర చదరపు అడుగుల్లో తెలంగాణ రాష్ట్ర కార్యకలాపాలుసాగేవి. తాజాగా నిర్మిస్తున్నకొత్త సచివాలయాన్ని ఆరు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. కొత్త సచివాలయంలో ఆరు నుంచి ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. పాత సచివాలయంలోని భవనాల్లో 9.16లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంటే.. కొత్త దాన్లో దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం తక్కువగా ఉండటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.

అత్యాధునిక ఫీచర్లు ఉంటాయే తప్పించి.. మొత్తంగా చూస్తే.. పాత దానితో పోలిస్తే కొత్త దాన్లో ఉండే చదరపు అడుగులు మాత్రం తక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకేసారి పెద్ద ఎత్తున సమీక్షలు నిర్వహించేందుకు వీలుగా భవనాలు లేవన్న కారణంగా కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. మరి.. ఇలా నిర్మించే ఈ భారీ భవనంలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు.. భారీ ఎత్తున ఎందుకు నిర్మించటం లేదన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న చదరపు అడుగులకు తక్కువగా ఉండటంతో గమనార్హం.