వైసీపీ ఎంపీ కీలక నాయకుడు వి. విజయసాయి రెడ్డి నోరు జారారు. అది కూడా ఏపీ హైకోర్టుపైనే కావడం గమనార్హం. తాజాగా ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. హైకోర్టు విషయంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర హైకోర్టు పరిధి దాటి ప్రవర్తించిందని అన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని.. కానీ హైకోర్టు రాష్ట్రానికి అసలు శాసనాధికారం లేదని తీర్పు ఇచ్చిందని సాయిరెడ్డి వ్యాఖ్యానింరు.
అయితే.. సాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో రాజ్యసభ చైర్మన్.. ఆయనను వారించే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. మీరు చేస్తున్న అభియోగాలకు ఆధారాలున్నాయా అని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ విజయసాయిని ప్రశ్నించారు. అయినప్పటికీ .. సాయిరెడ్డి మాత్రం తన మానాన తను మాట్లాడు తూ పోయారు. అంతేకాదు.. తాను చేస్తున్న విమర్శల విషయంలో వెనక్కి తగ్గేది కూడా లేదన్నారు.
దేశంలో రాజధాని ఒకచోట హైకోర్టు మరోక చోట ఉన్న రాష్ట్రాలు లేవా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించా రు. అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కోర్టులు వ్యాఖ్యలు చేస్తున్నాయన్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న ఆయన రాష్ట్ర విభజన జరిగిపోయి 8 సంవత్సరాలు అయినా.. ఇప్పటికీ దీని గురించి పట్టించుకోలేదన్నారు. ఈ పాపం ప్రస్తుతం అధికారంలోఉన్న బీజేపీ గతంలో విభజన చేసిన కాంగ్రెస్ పార్టీలదేనని వ్యాఖ్యానించారు.
విభజన చట్టం ప్రకారం హామీలను నెరవేర్చకపోతే ఎలా? అని విజయసాయిరెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ మర్చిపోయిందని పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు చాలదు.. పదేళ్లు కావాలని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. మొత్తానికి కోర్టులతో కయ్యం పెట్టుకునే దిశగానే వైసీపీ నేతలు ముందుకు సాగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.