సమాజంలో కొందరు వినూత్నంగా స్పందిస్తారు. అప్పటికి జరుగుతున్న పరిణామాలను భవిష్యత్తు కూడా గుర్తు పెట్టుకోవాలనే తలంపుతో..కొన్ని కొన్ని కీలక ఘట్టాలు చోటు చేసుకున్న సమయంలో పుట్టిన బిడ్డలకు ఆయా ఘటనల పేర్లే పెడుతుంటారు. దేశంలో కొన్నాళ్ల కిందటకే పరిమితమైందని భావించిన ఈ వినూత్న ఆలోచన.. ఇప్పటికీ కొనసాగుతోంది. మన తెలుగు నాట తీసుకుంటే.. డాక్టర్ సమరం ఆయన సోదరుడు లవణం ఇలా.. ఈ కుటుంబంలో అందరి పేర్లు వింతగా ఉంటాయి. కానీ ఇవన్నీ స్వాతంత్ర సంగ్రామానికి సంబంధించి ఆయా ఉద్యమాలు ఘటనలు జరిగినప్పుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గోపరాజు రామచంద్రరావు(గోరా) పెట్టుకున్న పేర్లు.
గత 2020 కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తూర్పుగోదావరిలో ఒక కుటుంబం అప్పుడే పుట్టిన ఆడ బిడ్డకు `కరోనా` అని పేరు పెట్టుకుంది. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ అభిమాని కుటుంబంలో పుట్టిన బిడ్డకు `సంకల్ప`(ప్రజా సంకల్ప యాత్రను స్ఫురించేలా) అని పేరు పెట్టుకున్నారు. ఇలా.. ఆయా ఘటనల సమయంలో పుట్టిన వారికి అలాంటి పేర్లు పెట్టుకోవడం.. గతంలోనే కాదు.. ఇప్పుడు కూడా కనిపిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లో అప్పుడే పుట్టిన మగబిడ్డకు ``టెట్``(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అని పేరు పెట్టారు. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. మరి ఏం జరిగిందంటే..
యూపీలోని అమ్రోహా జిల్లాలో ఉన్న నాన్పుర్ బిటా గ్రామానికి చెందిన రేణు దేవి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావాలన్న ఆశతో చాలారోజుల క్రితం యూపీ టెట్కు దరఖాస్తు చేసింది. పరీక్ష సమయానికి ఆమె నిండు గర్భవతి. టెట్కు హాజరయ్యేందుకు గజ్రైలాలోని రమాభాయి అంబేడ్కర్ డిగ్రీ కళాశాలకు భర్త సాయంతో వెళ్లింది. అయితే.. పరీక్ష రాస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఇన్విజిలేటర్ అప్రమత్తమై.. అంబులెన్స్ను పిలిపించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ రేణు దేవి.. మగబిడ్డకు జన్మనిచ్చింది. యూపీ టెట్ పరీక్షకు గుర్తుగా.. ఆ పిల్లవాడికి టెట్ అని అప్పటికప్పుడే పేరు పెట్టారు. వింతగా ఉన్నా.. ఇవన్నీ.. ఓ 20 ఏళ్ల తర్వాత తలుచుకుంటే.. మధుర స్మృతులుగా మిగిలిపోతాయి!!