Begin typing your search above and press return to search.

చైనాలో వ్యాక్సిన్ పేరుతో నడుస్తున్న రచ్చ తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   27 Sep 2020 5:30 PM GMT
చైనాలో వ్యాక్సిన్ పేరుతో నడుస్తున్న రచ్చ తెలిస్తే షాకే
X
ఎవరి పాపం ఎంతన్నది తేలకున్నా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. శాస్త్రసాంకేతికంగా ఇంత డెవలప్ అయినట్లుగా డిజిటల్ యుగంలో బిల్డప్పుల్ని కంటికి కనిపించని మాయదారి శత్రువు ఎంతలా ఆడుకుందో చూస్తున్నదే. ఈ వైరస్ పుట్టుక వెనుకున్న సత్యాన్ని బయట పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిఘా సంస్థలేమీ నిగ్గు తేల్చకపోవటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ వైరస్ కు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పరిశోధనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే.. వ్యాక్సిన్ తయారీ విషయంలో ఇప్పటికే రష్యా తాను సక్సెస్ అయినట్లు చెబుతున్నా.. ఆ విషయాన్ని నమ్మటానికి ప్రపంచ దేశాలు సిద్ధంగా లేవు. మరోవైపు.. ఈ మొత్తం ఆరాచకానికి కారణమైన చైనా విషయానికి వస్తే.. ఆ దేశంలో కరోనాకు వ్యాక్సిన్ తయారుచేసినట్లుగా ప్రభుత్వ రంగ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

కరోనాను కట్టడి చేసేందుకు వీలుగా.. చైనాలో అనుసరిస్తున్న విధానాల్ని పలువురు తప్పు పడుతున్నారు. అత్యవసరంగా తీసుకొచ్చిన వ్యాక్సిన్ ను ఒక పద్దతి ప్రకారం కాకుండా.. ఇష్టారాజ్యంగా ఇస్తున్నట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు వ్యాక్సిన్ విషయంలో వెల్లువెత్తుతున్న అభ్యంతరాల్ని.. ఆందోళనల్ని పట్టించుకోకుండా ప్రభుత్వ రంగ సంస్థ సినోఫార్మ్ ఇప్పటికే 3.5లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అదే తీరులో మరో కంపెనీ సినోవాక్ తన కంపెనీలోని తొంభై శాతం మంది ఉద్యోగులకు బలవంతంగా వ్యాక్సిన్ లు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం లేనప్పటికీ.. వ్యాక్సిన్ తీసుకున్న వారిపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నట్లుగా చెబుతున్నారు. తమఅభ్యంతరాలతో పని లేకుండా పలువురికి వ్యాక్సిన్ రెండో డోసుల్ని కూడా ఇచ్చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో చైనా ప్రజల్లో తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతున్నట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాలు చూస్తే.. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందన్న ఆనందం కంటే కూడా ఆందోళనే ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పక తప్పదు.