Begin typing your search above and press return to search.

'111' దెబ్బ కు నార్త్ కు ఈస్ట్ కు దిమ్మ తిరిగిపోతోంది

By:  Tupaki Desk   |   28 May 2023 7:00 PM GMT
111 దెబ్బ కు నార్త్ కు ఈస్ట్ కు దిమ్మ తిరిగిపోతోంది
X
కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జీవో 111ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం.. దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయటం తెలిసిందే. ఈ నిర్ణయం కారణంగా ఇప్పటివరకు నిబంధనల బంధనాల్లో ఉన్న 1.30 లక్షల ఎకరాలు విముక్తి కావటమే కాదు.. ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాల కు అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. హైదరాబాద్ కు తాగునీరు ను దశాబ్దాల తరబడి అందించిన జంట జలాశయాలకు దెబ్బ తగలకుండా ఉండేందుకు తీసుకొచ్చిన జీవో 111ను కేసీఆర్ సర్కారు రద్దు చేయటం ద్వారా.. రియల్ బూమ్ కు తెర తీశారు.

సైబరాబాద్ కు మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో భారీ ఎత్తున ఉన్న భూమి అందుబాటు లోకి వచ్చే అవకాశాలు ఉండటంతో.. హైదరాబాద్ నార్త్.. ఈస్ట్ ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ పైన తీవ్ర ప్రభావం పడనుందని చెప్పాలి. తూర్పు.. ఉత్తరం.. పశ్చిమం ఇలా అన్ని ప్రాంతాల్లోని భూముల ధరల మీద ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఇదెంత అన్న విషయానికి తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం సాక్ష్యంగా మారింది.

ఇటీవల హెచ్ ఎండీ ఆధ్వర్యంలో బాచుపల్లి.. మేడిపల్లి ప్రాంతాల్లో రెండు విడతల్లో ప్లాట్లను అమ్మకానికి పెట్టగా.. షాకింగ్ నిజం బయటకు వచ్చింది. జీవో 111ను రద్దు చేస్తామన్న నిర్ణయానికి ముందు నిర్వహించిన వేలంతో పోలిస్తే.. ట్రిపుల్ వన్ జీవో రద్దు తర్వాత నిర్వహించిన వేలంలో పలికిన ధరను చూస్తే.. ఈ మార్పు ఎంత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం సరాసరిన బాచుపల్లి గజం ధర రూ.18వేల నుంచి 20 వేల మధ్య పడిపోయినట్లుగా చెబుతున్నారు. మేడిపల్లిలోనూ ఇలాంటి పరిస్థితే ఉందంటున్నారు.

గజం ధరలో ఇంత భారీ మార్పు పై రియల్ ఎస్టేట్ వర్గాలు సైతం విస్మయానికి గురి చేస్తోంది. జీవో 111 రద్దు ప్రక్రియపూర్తి చేసి.. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసినంతనే.. ఆ ప్రాంతంలో రియల్ రంగం దూసుకెళ్లటం ఖాయమని చెబుతున్నారు. హైదరాబాద్ పశ్చిమాన ఏర్పాటు చేసిన హైటెక్ సిటీకి దగ్గర్లో ఉండే ప్రాంతాల్లో ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని భారీ ఎత్తున భూములు ఉన్నాయి. అవన్నీ అందుబాటులోకి వచ్చి.. నిర్మాణాలు షురూ చేస్తే.. నగర శివారు ఇప్పుడు జోరుగా సాగుతున్న రియల్ ప్రబావం పై పడటం ఖాయమంటున్నారు.

నగరానికి ఉత్తర దిశగా ఉన్న బాచుపల్లిలో 27.3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 279 ప్లాట్లతో తూర్పున మేడిపల్లిలో 55.12 ఎకరాల్లో 434 ప్లాట్లతో హెచ్ ఎండీఏ ప్లాట్లు వేసింది. మార్చి మొదటి వారం (ట్రిపుల్ వన్ జీవో విడుదలకు దాదాపు 40 రోజుల కు ముందు) జరిగిన వేలానికి భారీ ఆదరణ లభించింది. హెచ్ఎండీఏ నిర్ణయించిన ధర కంటే కూడా దాదాపు135 శాతం అధిక ధరకు ప్లాట్లు అమ్ముడయ్యాయి. అత్యధికంగా చదరపు గజం రూ.68 వేలు.. సగటున చదరపు గజం రూ.59,149గా పలికింది.

ఈ నెల 22-24 మధ్యన జరిగిన ఈ వేలంలో బాచుపల్లి లే అవుట్ లో సగటున చదరపు గజానికి 19,475 తగ్గి రూ.39,674గాఖరారు కావటం గమనార్హం. ఇక మేడిపల్లిలో తొలుత నిర్వహించిన వేలంలో చదరపు గజం అప్ సెట్ విలువ రూ.32 వేలుగా నిర్ణయిస్తే.. అత్యధికంగా రూ.63 వేలు పలికింది. తాజా వేలంలో మాత్రం రూ.18,062 తగ్గి రూ.40,668కు ఖరారైంది. ఈసారి వేలం వేసిన ప్లాట్లలో అమ్ముడుకాకపోవటం గమనార్హం. ఇలాంటి పరిస్థితి ఇటీవల కాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదంటున్నారు. ట్రిపుల్ 111 జీవో రద్దుతో వేలాది ఎకరాలు నిర్మాణాల కు అందుబాటులోకి వచ్చే వీలుండటంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.