Begin typing your search above and press return to search.

ఇవాళ వర్షం పడితే.. ఐపీఎల్ ట్రోఫీ ఎవరికి దక్కుతుంది?

By:  Tupaki Desk   |   29 May 2023 10:57 AM GMT
ఇవాళ వర్షం పడితే.. ఐపీఎల్ ట్రోఫీ ఎవరికి దక్కుతుంది?
X
ఎన్నో ప్రశ్నలు. మరెన్నో అంచనాలు. అన్నింటికి మించిన ఉత్కంఠ.. వెరసి అహ్మదాబాద్ లో జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ పోరు కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. వర్ష సూచన లేకపోవటమేకాదు.. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఎండ ఖాయమని.. వాతావరణం పొడిగా ఉంటుందన్న రిపోర్టులు వచ్చాయి.

అందరి అంచనాలకు భిన్నంగా ఆదివారం వర్షం ముంచెత్తటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అదే సమయంలో.. తీవ్రమైన నిరాశకు గురి చేసింది. దీంతో రిజర్వే డే అయిన సోమవారం ఫైనల్ పోరు జరగనుంది.

మరి.. ఈ రోజు కూడా వరుణుడు కరుణించకపోతే ఏం జరుగుతుంది? ఎవరు విజేతగా నిలుస్తారు? ఆదివారం ఎలా అయితే అనూహ్య రీతిలో వర్షం పడిందో.. అలానే సోమవారం కూడా అలాంటి పరిస్థితులు ఎదురై.. కనీసం ఐదు ఓవర్లు కూడా ఆడేందుకు వాతావరణం అనుకూలించకుంటే.. ఎవరికి లాభంగా మారుతుంది? ఎవరికి నష్టంగా మారుతుంది? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
వర్షం కారణంగా ఐదు ఓవర్ల మ్యాచ్ ను నిర్వహించే వీలు లేకుంటే.. సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అది కూడా సాధ్యం కాకుంటే మాత్రం మ్యాచ్ రద్దు అవుతుంది.

అలాంటి వేళలో.. అత్యధిక పాయింట్లు ఎవరికైతే ఉంటాయో వారే విజేతగా నిలుస్తారు. అదే జరిగితే.. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 16 ట్రోఫీ వరించే వీలుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన పక్షంలో.. సిరీస్ లో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టును విజేతగా నిర్ణయిస్తారు.

లీగ్ దశలో గుజరాత్ జట్టు 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. చెన్నై 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది నుంచే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్.. తొలి సీజన్ లోనే విజేతగా ఆవిర్భవించటం తెలిసిందే. వర్షం రద్దు కారణంగా విజేతను నిర్ణయించాల్సి వస్తే గుజరాత్ లాభ పడుతుంది.

అదే జరిగితే.. వరుసగా రెండోసారి గుజరాత్ విజేతగా నిలిచినట్లు అవుతుంది. అదే సమయంలో చెన్నై జట్టు ఇప్పటివరకు నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. మరోసారి ట్రోఫీని సొంతం చేసుకుంటే.. అత్యధికసార్లు ఐపీఎల్ టోర్నీని సొంతం చేసుకొని విజేతగా నిలిచిన ముంబయి జట్టుకు సమానంగా మారుతుంది. మరేం జరుగుతుందో చూడాలి.