హై(ప్)దరాబాద్ అసలు లెక్క ఇదా?

Mon Jan 17 2022 18:04:54 GMT+0530 (India Standard Time)

IT Companies In Hyderabad

హైదరాబాద్ మహానగరం దూసుకెళుతోంది. ఐటీలో మన దేశంలోనే ఇరగదీస్తున్నాం. ప్రపంచంలోనే అమెజాన్ డేటా సెంటర్ ఉన్నది హైదరాబాద్ లోనే? ఐటీ ఉత్పత్తుల్లో హైదరాబాద్ మిగిలిన మహానగరాల కంటే మిన్నగా ఉంది.. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే గొప్పలు ఇటీవల కాలంలో ప్రభుత్వం చెప్పుకోవటం కనిపిస్తుంది. ఒక్క ఐటీ కంపెనీల విషయంలోనే కాదు.. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించే విషయంలో.. స్టార్టప్ లకు హబ్ గా ఒకప్పటి ముత్యాల నగరి ముందు ఉందన్న మాట వినిపిస్తోంది.అందుకు భిన్నంగా ఒక రిపోర్టు వైరల్ అవుతోంది.తాజాగా బయటకు వచ్చిన ఈ  రిపోర్టును చూసినప్పుడు హైదరాబాద్ ఇమేజ్ విషయంలో ఇప్పటివరకు ఉన్న ప్రచారానికి భిన్నంగా ఉండటం కనిపిస్తుంది.ఫిన్ ట్రాకర్ మీడియా రిపోర్టు ఆధారంగా ఎన్ ట్రాకర్ పేరుతో 2021లో దేశంలోని నగరాల్లో స్టార్టప్ ఫండింగ్ ల పరిస్థితి ఏమిటి? అన్న దానిపై ఒక నివేదికను సిద్ధం చేశారు. ఇందులో దేశంలోని 10 నగరాల (బెంగళూరు.. ఢిల్లీ.. ముంబయి.. పూనే.. చెన్నై.. జైపూర్.. హైదరాబాద్.. అహ్మదాబాద్.. కోల్ కతా.. పాట్నా) ను తీసుకుంటే.. అందులో హైదరాబాద్ స్థాయి ఏమిటన్నది చూస్తే.. కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి.

ప్రభుత్వం చెప్పే గొప్పలకు రిపోర్టులో పేర్కొన్న గణాంకాలకు ఎక్కడా మ్యాచ్ కావటం లేదనే చెప్పాలి. 2021లో బెంగళూరులో 647 స్టార్ట్ ప్ లు వచ్చాయి. వీటి ద్వారా 20.25 వేల కోట్లు వచ్చినట్లుగా చెబుతున్నారు. 2020తో పోలిస్తే.. వ్రద్ధి రేటు 53 శాతంగా ఉంది. తర్వాతి స్థానంలో ఢిల్లీ మహానగరంలో 431 స్టార్టప్ సంస్థలకు ఫండింగ్ వచ్చాయి.వీటి విలువ రూ.8.97 వేల కోట్లుగా చెబుతున్నారు. మూడో స్థానంలో ముంబయి నిలిస్తే.. నాలుగో స్థానంలో ఫూణె.. ఐదో స్థానంలో చెన్నై.. ఆరో స్థానంలో జైపూర్ నిలిచింది.

ఎంతో గొప్పగా చెప్పుకునే హైదరాబాద్ ఏకంగా ఏడో స్థానంలో ఉండటం గమనార్హం. జైపూర్ నగరం కంటే హైదరాబాద్ వెనుకబడి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. హైదరాబాద్ కు 2021లో కేవలం 47 సంస్థలకు రూ.210 కోట్ల ఫండింగ్ మాత్రమే వచ్చింది. ఈ లెక్కన చూస్తే.. మొదటి స్థానంలో ఉన్న బెంగళూరుకు హైదరాబాద్ మహానగరం మరెంత దూరంలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. మరి.. వెలిగిపోతోంది.. దూసుకెళుతోంది.. దూకుడే దూకుడు అన్నట్లు గొప్పలు చెప్పే మాటలకు.. ఈ రిపోర్టులోని గణాంకాలకు ఏ మాత్రం పోలిక లేకపోవటం ఏమిటి? అంటే.. హైదరాబాద్ ను హైప్ అనే జాకీలు పెట్టి లేపుతున్నారా? అన్న సందేహం కలుగక మానదు.