Begin typing your search above and press return to search.

ఏడేళ్లలో 6 కోట్లు కూడబెట్టండి.. అంతరిక్షంలోకి వెళ్దురుగాని..

By:  Tupaki Desk   |   18 March 2023 5:00 AM GMT
ఏడేళ్లలో 6 కోట్లు కూడబెట్టండి.. అంతరిక్షంలోకి వెళ్దురుగాని..
X
ఈ విశాల విశ్వం మొదలెక్కడ..? అంతెక్కడ? ఇంతటి విశ్వంలో ఎందరు సూర్యులున్నారు..? అసలు భూమి కాక జీవం ఉన్న మరో గ్రహం ఉందా..? విశ్వం విశాలమే కాదు.. అనంతమా..? ఓ అంతు దరి లేదా..? ఎక్కడో ఒకచోట జీవం ఉండే ఉంటుందా..? ఆ జీవం మనకంటే అడ్వాన్స్ గా ఉండొచ్చా..? లేదా వెనుకబడి ఉండొచ్చా? ఇవి దశాబ్దాలుగా అంతుచిక్కని ప్రశ్నలు. అమెరికన్లేమో గ్రహాంతరవాసులు ఉన్నారని నమ్ముతారు. ఫ్లయింగ్ సాసర్ లో వారు వస్తున్నారని విశ్వసిస్తారు. అసలు యూఎఫ్ వోల పేరు చెబితేనే బెంబేలెత్తిపోతారు. అదే అమెరికాకు చెందిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అంతరిక్ష యాత్రలు చేపడతాడు.

అదే అమెరికాకు చెందిన మరో అపర కుబేరుడు జెఫ్ బెజోస్ కూడా పోటాపోటీగా ఇదే బాటను ఎంచుకుంటాడు. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంగతి సరేసరి. ఇప్పుడు ఇదే కోవలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా సాహసానికి దిగుతోంది. అంతరిక్ష ప్రయాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఈ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు.

జస్ట్ ఏడేళ్లే..

మీరు కొంత సంపన్నులా..? టూరిజం అంటే ఆసక్తి ఉందా..? వివిధ దేశాలు తిరిగి బోర్ కొట్టేసిందా..? మరెక్కడైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలని ఉందా?? అయితే.. కాస్త ఆగండి.. ఏడేళ్లలో రూ.6 కోట్లు కూడబెట్టుకోండి. 2030 నాటికి మిమ్మల్ని ఆ డబ్బుతో అంతరిక్షానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో అంటోంది. ఇప్పుడంతా అంతరిక్ష పర్యాటకానిదే హవా కదా..? అందుకే నాసా, మస్క్ సంస్థ స్పేస్‌ ఎక్స్‌, బెజోస్ కంపెనీ అమెజాన్‌ సహా పలు సంస్థలు రోదసిలోకి ఔత్సాహికులను పంపుతున్నాయి. ఈ క్రమంలో 2030 నాటికి స్పేస్‌ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకొంటున్నదని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు. ఇందుకు ఒక్కో పర్యాటకుడి నుంచి ఇస్రో రూ.6 కోట్లు వసూలు చేయనున్నట్లు చెప్పారు.

17 ఏళ్ల కిందటే పురుడు

భారత మానవ అంతరిక్షయాత్ర కార్యక్రమాన్నిఇస్రో 2007 లో రూపొందించింది. [భూ నిమ్న కక్ష్య లోకి మానవులతో కూడిన కక్ష్యా వాహనాన్ని పంపించే సాంకేతికతను అభివృద్ధి చెయ్యడం ఈ కార్యక్రమ ఉద్దేశం. గగన్‌యాన్ అనే అంతరిక్ష నౌకను జిఎస్‌ఎల్‌వి మార్క్ -3 రాకెట్ ద్వారా ప్రయోగించే తొట్టతొలి యాత్రను 2021 డిసెంబరులో తలపెట్టింది. 2018 ఆగస్టులో గగన్‌యాన్ ను ప్రకటించే ముందు, మానవ అంతరిక్ష యాత్ర ఇస్రో ప్రాధాన్యాల్లో లేదు. అయితే దీనికి అవసరమైన శక్తి సామర్ధ్యాలను మాత్రం చాలావరకు ఇస్రో సాధించింది. ఈ యాత్రకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలావరకు అప్పటికే అభివృద్ధి చేసింది. క్రూ మాడ్యూల్ వాతావరణ పునఃప్రవేశ ప్రయోగం జరిపింది.

అత్యవసర పరిస్థితుల్లో యాత్రను నిలిపేసే ప్యాడ్ అబార్ట్ టెస్ట్‌ను చేసింది. ఈ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల లోపు ఖర్చౌతుంది. 2021 డిసెంబరులో జరప తలపెట్టిన ముగ్గురు వ్యోమగాముల, 7 రోజుల తొట్టతొలి యాత్రకు భారత ప్రభుత్వం 2018 డిసెంబరులో మరో రూ.10 వేల కోట్లను మంజూరు చేసింది. షెడ్యూల్ ప్రకారం పూర్తయితే, సోవియట్ యూనియన్ / రష్యా, అమెరికా, చైనాల తరువాత స్వతంత్రంగా మానవ అంతరిక్ష యాత్రను నిర్వహించిన నాల్గవ దేశంగా భారత్ అవతరిస్తుంది. మానవ అంతరిక్ష యాత్రలను నిర్వహించిన తరువాత, వాటికి కొనసాగింపుగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. చంద్రుడిపైకి మానవ యాత్రను కూడా చేపట్టే అవకాశం కూడా లేకపోలేదు. 2007 ఆగస్టు 9 న అప్పటి ఇస్రో ఛైర్మన్ జి. మాధవన్ నాయర్, మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమ రూపకల్పనను ఏజెన్సీ "తీవ్రంగా పరిశీలిస్తోందని" సూచించారు.

కొత్త అంతరిక్ష నౌక టెక్నాలజీల అభివృద్ధిపై ఇస్రో ఒక సంవత్సరంలోనే నివేదిస్తుందని కూడా సూచించారు. ఇద్దరు వ్యోమగాములను భూ నిమ్న కక్ష్యలోకి తీసుకువెళ్ళడానికి పూర్తి స్వయంప్రతిపత్తి గల కక్ష్యా వాహన అభివృద్ధి కొన్ని నెలల తరువాత ప్రభుత్వం ₹ 95 కోట్లు కేటాయించినప్పుడు ప్రారంభమైంది 2007-08 లలో ప్రాజెక్టు సన్నాహకాల కోసం ఈ నిధులను కేటాయించింది. మానవ అంతరిక్ష యాత్రకు ₹ 12,400 కోట్లు, ఏడు సంవత్సరాలూ కావాలి. 2007–2012 కాలానికి ఈ కార్యక్రమం కోసం ₹ 5,000 కోట్లు అవసరమౌతాయని ప్రణాళికా సంఘం అంచనా వేసింది. 2009 ఫిబ్రవరిలో, భారత ప్రభుత్వం మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి అనుమతి ఇచ్చింది. కానీ దీనికి పూర్తిగా నిధులు సమకూర్చడంలో గాని, సమకూర్చే షెడ్యూలును సృష్టించడంలో గానీ అది విఫలమైంది. 2007 లో పిఎస్‌ఎల్‌వి ద్వారా 600 కిలోల స్పేస్ క్యాప్స్యూల్ రికవరీ ఎక్స్‌పెరిమెంట్ ను ప్రయోగించి, 12 రోజుల తరువాత తిరిగి భూమికి తెప్పించడం ద్వారా కార్యక్రమ పరీక్షలు మొదలయ్యాయి. దీని తరువాత 2014 లో క్రూ మాడ్యూల్ వాతావరణ పునఃప్రవేశ ప్రయోగం, 2018 లో ప్యాడ్ అబార్ట్ పరీక్ష విజయవంతంగా జరిగాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.