Begin typing your search above and press return to search.

హాలికులైననేమి : వ్యవసాయం చేస్తున్న ఏబీవీ

By:  Tupaki Desk   |   1 July 2022 4:30 PM GMT
హాలికులైననేమి : వ్యవసాయం చేస్తున్న ఏబీవీ
X
భాగవతోత్తముడు పోతనామాత్యుడు ఏనాడో  చెప్పిన మాటను ఆయన అక్షరాలా పాటిస్తున్నారు అనుకోవాలి. భాగవతంలో పోతన ఒక పద్యంలో హాలికులైననేమి గహనాంతరసీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై అని రాస్తారు. దాని అర్ధం ఏమిటంటే అడవిలోపల కందమూలాలు తవ్వుకుంటూ బతుకు సాగించినా మంచిదే అని అర్థం. అంటే తన‌కు నప్పని కొలువులు  నెలవులు ఉన్న చోట అలా కుములుతూ కృంగుతూ ఉండడం కంటే అదే ఉత్తమమని పోతన్న పదిహేవ శతాబ్దంలోనే క్లారిటీగా  చెప్పారు.

పోతన్న చెప్పింది ఎంతమంది తెలుసో ఏమో కానీ మన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు బాగా తెలుసు. ఆయన తనను రెండవసారి ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ పోతన్న పద్యాన్నే వినిపించారు. దుర్మార్గపు రాజుల ఏలుబడిలో పనిచేసే కంటే అదే నయం అని పోతన్న  పద్యాన చెప్పాడని   ఆయన  వివరించారు.

ఇపుడు ఆయన అదే చేస్తున్నారు. ఏకంగా తన పొలంలోని వెళ్ళి అచ్చమైన రైతులా మారిపోయారు. దుక్కి దున్నేశారు. పొలంలో ఒక కర్షకుడి మాదిరిగా ఆయన కాలికి ఏమీ వేసుకోకుండా నడుస్తూ తమ పని తాను చేసుకుంటున్నారు. నిజంగా బాగుంటే వ్యవసాయానికి మించినది లేదు అని అంటారు. ఒకరిని పెట్టేదే కానీ తాను ఆశించేది కాదు భూమి. ఆ భూమి పుత్రుడిగా ఉండడం కంటే గొప్ప ఉద్యోగం ఏముంది.

ఇదిలా ఉంటే ఏబీవీకి ఇది రెండవసారి  సర్కార్ సస్పెన్షన్.  ఆయన చాలా మధనపడి ఉన్నారు. తాను ఏమి తప్పు చేశానని ఇలా టార్గెట్ చేస్తున్నారు అని మీడియా ముందు వాపోయారు.

ఇక తాను న్యాయం స్థానాలలో తేల్చుకుంటాను అని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆ పనిలో కూడా ఉండవచ్చు. ఇక సస్పెన్షన్ వేటు పడగానే అలా పొలంలోకి దిగిపోయారు ఎంచక్కా పంచె కట్టి పైన తలపాగా చుట్టి  అచ్చమైన రైతన్నలా మారిపోయారు.

ఇదిలా ఉంటే ఏబీవీ పదవీకాలం ఇంకా రెండేళ్ళు ఉందిట. ఆయన ఈ ప్రభుత్వం ఉండగానే రిటైర్ అవుతారు అని తెలుస్తోంది. అంటే కొత్త ప్రభుత్వం వచ్చేటప్పటికి ఆయన ఖాకీగా కనిపించరు అన్న మాట. అయితే మాత్రం తనను అన్యాయంగా వేధిస్తున్న వారి విషయంలో తేల్చుకునే తీరుతాను అంటున్న ఏబీవీ రైతు వేషంలో కూడా  అదరహో అన్నట్లుగా ఉన్నారు