వదల ఏబీ వదల అంటున్న జగన్ ప్రభుత్వం!

Wed Jun 29 2022 06:21:43 GMT+0530 (IST)

IPS Officer AB Venkateshwara Rao

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కష్టాలు వీడటం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్లకుపైగా సస్పెన్షన్ కు ఏబీ వెంకటేశ్వరరావు గురయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇటీవల ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ విభాగం కమిషనర్‌గా ఎట్టకేలకు ఆయన మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇంతలోనే ఆయనపై గతంలో క్రిమినల్ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జూన్ 28న ఉత్తర్వులు జారీచేశారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీగా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశ రక్షణ శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాలు కొనుగోలు చేశారని ఆయనపై గతంలో కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ ఆమోదించడంతో ఆయన్ను 2020 మార్చి 7న జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7తో ఆయన సస్పెన్షన్ ముగిసిందని పేర్కొంది. రెండేళ్లకు మించి అఖిల భారత సర్వీసు అధికారులను సస్పెండ్ చేయడం కుదరదని కోర్టు చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే.. గతంలో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుల విషయంలో దర్యాప్తును కొనసాగించవచ్చని అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు తనపై సస్పెన్షన్ ఎత్తేయడంతో ఆ ఉత్తర్వుల కాపీతో ఏబీ.. సీఎస్ సమీర్ శర్మను కలిశారు. తనను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అలాగే తనకు ఆపేసిన జీతభత్యాలను కూడా చెల్లించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును ఏమాత్రం ప్రాధాన్యం లేని ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ విభాగం కమిషనర్‌గా నియమించింది.

అయితే.. ఆయనను మళ్లీ విధుల్లోకి కొద్ది రోజులు కూడా కాకముందే తనపై నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసేందుకు ఆయన యత్నిస్తున్నారని మరోసారి ఆయనపై వేటేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా చక్రం తిప్పిన ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలను కొనుగోలు చేశారని.. వాటిని ఉపయోగించి ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారని జగన్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది.

ఏబీ వెంకటేశ్వరరావు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆకాశ్ అడ్వాన్స్‌డ్ సిస్టం అనే కంపెనికి అడ్డగోలుగా లబ్ధి కలిగించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు పెండింగులో ఉంది. ఆకాశ్ అడ్వాన్స్‌డ్ సిస్టం కంపెనీకి ప్రయోజనం కల్పిస్తూ 2018 అక్టోబరు 31న ఏబీ వెంకటేశ్వరరావు రూ.35లక్షలు చెల్లించారని చెబుతోంది. ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఇజ్రాయెల్‌కు చెందిన ఉత్పత్తులను భారత్‌లో తీసుకురావడానికి యత్నించారని తీవ్ర అభియోగాలు ఆయనపై మోపింది.

ఈ నేపథ్యంలో.. ఇటీవలే ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ విభాగం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావు తనపై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించడం ద్వారా అఖిల భారత సర్వీసు నిబంధనలను మరోసారి ఉల్లంఘించారని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో క్రిమినల్ కేసు పెండింగులో ఉన్న అధికారి తన హోదాను దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ విధించవచ్చని పేర్కొంటూ ఆయనను జూన్ 28న మరోసారి సస్పెండ్ చేసింది.