Begin typing your search above and press return to search.

ఐపీఎల్ మరో 3 రోజుల్లో.. గణీనయ మార్పులతో

By:  Tupaki Desk   |   28 March 2023 3:24 PM GMT
ఐపీఎల్ మరో 3 రోజుల్లో.. గణీనయ మార్పులతో
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15 సీజన్లు పూర్తి చేసుకుంది. 16వ సీజన్ లో అడుగుపెడుతోంది. కేవలం మరో మూడు రోజులే.. వచ్చే శుక్రవారం 16వ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్-మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్.. ఆయనకు మెంటార్ లాంటి ధోనీ సారథ్యంలోని చెన్నైని ఢీకొనబోతోంది. కాగా, ఈసారి చాంపియన్ ఎవరో పసిగట్టడం కాస్త కష్టమే. ముంబై పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. చెన్నై వెటరన్ అయిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ టైటాన్స్ కుర్రాళ్లతో కళకళలాడుతున్నాయి. వీటితో పాటు రాజస్థాన్ రాయల్స్ వంటి జట్టుకు ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పొచ్చు. కాగా, మూడేళ్లుగా వివిధ అవాంతరాలు ఎదుర్కొంటున్న ఐపీఎల్.. ఈ ఏడాది మాత్రం స్వదేశంలో పూర్తిస్థాయిలో జరుగనుంది. దీంతోపాటు కొన్ని మార్పులతో నిర్వహించనున్నారు.

మరింత ఆకర్షణీయంగా

ఈ సారి లీగ్ ను ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. నో బాల్‌ సమీక్ష, టాస్ అనంతరం తుది జట్టు ప్రకటన, ఇంపాక్టు ప్లేయర్ ‌.. ఇలా ఎన్నో కొత్త విషయాలను చూడబోతున్నాం. ఫార్మాట్ సైతం కాస్త మారింది. లీగ్ లో గతేడాది నుంచి 10 జట్లు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా మార్పులు చేశారు. ఒక్కో గ్రూప్ లో 5 జట్లను ఉంచి.. రెండు గ్రూపులుగా విభజించారు. దీనికి ప్రాతిపదిక లీగ్ లో గత ప్రదర్శన కావడం గమనార్హం. లీగ్‌ దశలో ఓ జట్టు.. తమ గ్రూపులోని నాలుగు జట్లతో పాటు అవతలి గ్రూప్ లోని సమాన స్థాయి ఉన్న జట్టుతో రెండేసి మ్యాచులు, మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడింది. అలా ప్లేఆఫ్స్‌కు ముందు ఒక్కో జట్టు 14 మ్యాచ్‌ లు ఆడేలా చూశారు. ఈ సారీ ఒక్కో జట్టు 14 మ్యాచులే ఆడుతుంది. కానీ చిన్న మార్పు. ఒక గ్రూప్‌ లోని ప్రతి జట్టు.. అవతలి గ్రూప్‌ లోని 5 జట్లతోనూ రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. తమ గ్రూప్‌ లోని 4 జట్లతో తలపడుతుంది. అంటే.. 'ఎ' గ్రూపు లో ఉన్న ముంబయి.. 'బి' గ్రూపు లోని చెన్నై, సన్‌రైజర్స్‌ , ఆర్సీబీ, పంజాబ్ ‌, గుజరాత్‌ తో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. 'ఎ' గ్రూప్‌ లోని మిగతా జట్లు.. కోల్‌కతా, రాజస్థాన్ ‌, దిల్లీ, లఖ్‌ నవూతో ముంబయి ఒక్కో మ్యాచ్‌లో పోటీపడుతుంది.

టాస్‌ తర్వాత తుది జట్టు..

ఆటలో టాస్ ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ, ఇంపాక్ట్ ఆటగాడి పద్ధతికి మరింత బలం చేకూర్చేలా బీసీసీఐ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ లో టాస్‌ వేసిన తర్వాత తుది జట్లను ప్రకటించే అవకాశం ఇచ్చింది. తద్వారా రెండు జట్లకూ ప్రయోజనం కలుగుతుంది. పిచ్‌ స్వభావాన్ని బట్టి టాస్‌ గెలిచిన కెప్టెన్‌ అదనంగా ఓ బౌలర్‌ లేదా బ్యాటర్‌ ను తీసుకోవచ్చు. టాస్ నెగ్గని సారథి కూడా పరిస్థితులకు తగినట్లుగా జట్టులో మార్పు చేసుకోవచ్చు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ ఆరంభ సీజన్‌లో ఈ విధానం అనుసరించారు. టాస్‌ వేసేందుకు కెప్టెన్లు 11 మంది ఆటగాళ్లతో కూడిన చెరో రెండు జాబితాలతో వచ్చారు. దీంతో టాస్‌ గెలిస్తే ఒకటి, ఓడిపోతే మరొక జట్టును మ్యాచ్‌లో బరిలో దించొచ్చు.

5 పరుగుల జరిమానా..

బౌలర్‌ బంతి వేసేటప్పుడు ఫీల్డర్‌ లేదా కీపర్‌ దురుద్దేశపూర్వకంగా కదిలితే ఫీల్డింగు జట్టుకు అయిదు పెనాల్టీ పరుగులు విధించనున్నారు. ఆ బంతిని డెడ్‌ బాల్‌గా ప్రకటిస్తారు. నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయలేకపోతే వలయం బయట అయిదుగురికి బదులు కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తారు.

వైడ్, నోబాల్ కూ డీఆర్ఎస్

ఈ సీజన్‌ నుంచి వైడ్‌, నోబాల్‌ కు కూడా సమీక్ష కోరే అవకాశం ఉంది. డబ్ల్యూపీఎల్ లో దీన్ని అమలు చేశారు. ఒక్క పరుగు తేడాతోనే ఫలితాలు మారిపోయే టి20 ఫార్మాట్లో అంపైర్లు కూడా కొన్నిసార్లు వైడ్‌, నో బాల్‌ పరంగా తీసుకున్న నిర్ణయాలు వివాదాలకు దారితీశాయి. దీంతోనే సమీక్ష కోరే అవకాశం ఇచ్చారు. నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చే బంతిని నో బాల్‌గా ప్రకటించే విషయంలో సరైన నిర్ణయం తీసుకునే ఆస్కారం ఏర్పడుతుంది.

మళ్లీ ఇంటా, బయట..

ఈ సారి లీగ్‌ ఇంట, బయట విధానంలో జరగబోతుంది. ప్రతి జట్టు సొంతగడ్డపై 7, ప్రత్యర్థి మైదానాల్లో 7 మ్యాచ్‌ లు ఆడుతుంది. కరోనా వ్యాప్తితో 2020లో పూర్తిగా యూఏఈలో, 2021లో సగం మ్యాచ్‌లు ఇక్కడ, సగం యూఏఈలో నిర్వహించారు. 2022లో కరోనా వ్యాప్తి పెద్దగా లేకున్నా.. వేదికలు మాత్రం పరిమితం. ముంబయి, పుణె, కోల్‌ కతా, అహ్మదాబాద్‌ మాత్రమే ఆతిథ్యమిచ్చాయి. ఈసారి అదనంగా రెండు నగరాలు మ్యాచ్‌లకు వేదికలుగా మారబోతున్నాయి. రెండో సొంతగడ్డగా గువాహతిలో రాజస్థాన్‌ , ధర్మశాలలో పంజాబ్‌ మ్యాచ్‌ లు ఆడనున్నాయి. వీటితో పాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, కోల్‌కతా, లఖ్‌నవూ, దిల్లీ, అహ్మదాబాద్‌, జైపుర్‌, మొహాలీలో మ్యాచ్‌లు జరుగుతాయి.

ఆటగాడి ప్రభావం..

'ఇంపాక్ట్‌ ప్లేయర్' ఈ లీగ్ లో అత్యంత చర్చనీయాంశం అవుతోన్న పదం. దీనికోసం తుది 11 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు సబ్‌ స్టిట్యూట్‌ లను ప్రకటించాలి. ఈ నలుగురిలో నుంచే ఒకరిని ఇంపాక్ట్ ఆటగాడిగా ఆడించొచ్చు. అయితే, ఇక్కడో చిక్కుంది. తుది 11 మందిలో విదేశీ ఆటగాళ్లు నలుగురు కంటే తక్కువ ఉంటే తప్ప ఇంపాక్ట్‌ ఆటగాడిగా కచ్చితంగా భారత క్రికెటర్‌ నే ఎంచుకోవాలి. ముందుగానే తుది జట్టులో ప్రకటించిన ఓ క్రికెటర్‌ స్థానంలో మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా ఈ ఇంపాక్ట్‌ ఆటగాడిని తీసుకోవచ్చు. ఇంపాక్ట్‌ ఆటగాడి కోసం మైదానం వీడిన వాడు మళ్లీ మ్యాచ్‌ లో కొనసాగే అవకాశం ఉండదు. ఇన్నింగ్స్‌ ఆరంభానికి ముందు లేదా ఓవర్‌ ముగిశాక లేదా వికెట్‌ పడ్డాక లేదా ఓ బ్యాటర్‌ రిటైరయ్యాకే ఇంపాక్ట్‌ ఆటగాడు మైదానంలోకి రావాల్సి ఉంటుంది. కానీ పదకొండు మంది మాత్రమే బ్యాటింగ్‌ చేయాలి. అప్పటికే రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన బౌలర్‌ స్థానంలో వచ్చే ఇంపాక్ట్‌ ఆటగాడు తన పూర్తి కోటా నాలుగు ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.