Begin typing your search above and press return to search.

కరోనా వేళ ఐపీఎల్.. ప్రాక్టీస్ కన్నా టెస్టులే ఎక్కువ

By:  Tupaki Desk   |   5 Aug 2020 3:30 AM GMT
కరోనా వేళ ఐపీఎల్.. ప్రాక్టీస్ కన్నా టెస్టులే ఎక్కువ
X
ఈసారి ఐపీఎల్ సీజన్ ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించటం తెలిసిందే. ఈ టోర్నీలో ఆడేందుకు ఆటగాళ్లకు.. సిబ్బందికి మార్గదర్శకాల్ని జారీ చేశారు. వీటిని చూస్తే.. ఆట కంటే కూడా కరోనా ఉందో లేదో తేల్చటానికే ఎక్కువ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందన్న భావన కలగటం ఖాయం.
వివిధ దశల్లో ఆటగాళ్లకు నెగిటివ్ వస్తేనే మ్యాచ్ ముందు జరిగే ప్రాక్టీస్ కు అనుమతిస్తారు. ఐపీఎల్ కోసం సిద్ధం చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డ్రాఫ్ట్ కఠినంగా ఉందని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటగాళ్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కఠినమైన విధివిధానాల్ని పాటిస్తున్నారని చెప్పాలి. ముందుగా యూఏఈలో జరిగే శిబిరానికి హాజరయ్యేందుకు భారత క్రికెటర్లు.. వారి సహాయక సిబ్బంది వరుసగా ఐదుసార్లు కరోనా టెస్టుల్లో నెగిటివ్ రావాల్సి ఉంటుంది.

అదే సమయంలో 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ఆర్టీపీసీఆర్ టెస్టుల్ని నిర్వహిస్తారు. రెండింటిలోనూ నెగిటివ్ రావాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇదంతా యూఏఈకి బయలుదేరటానికి వారం ముందు జరుగుతుంది. ఒకవేళ ఈ పరీక్షల్లో ఎవరైనా పాజిటివ్ అని తేలితే.. పద్నాలుగురోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. ఆ తర్వాత కూడా వరుసగా రెండుసార్లు నెగిటివ్ తేలిన తర్వాతే పంపుతారు.

ఇలా ఐదుసార్లు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ గా తేలిన తర్వాత యూఏఈ ప్రయాణం ఉంటుంది. ఆ దేశం చేసిన తర్వాత తొలి వారంలో మూడుసార్లు పరీక్షలు చేయించుకోవాలి. అవన్నీ కూడా నెగిటివ్ అని తేలాలి. అప్పుడే బయో బబుల్ జాబితాలో సదరు క్రీడాకారుడి పేరును చేరుస్తారు. ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఇస్తారు. అందుకే ఈ వారం సమయంలో ఆటగాళ్లు.. వారి సహాయక సిబ్బంది ఒకరినొకరు కలుసుకోకూడదు.

ప్రాక్టీస్ సంగతి అలా ఉంటే.. ఐపీఎల్ మొదలయ్యాక ప్రతి ఐదు రోజులకు ఒకసారి ప్రతి క్రికెటర్ కు కోవిడ్ పరీక్షల్ని నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో స్థానిక నిబంధనలకు అనుగుణంగా మరిన్ని ఎక్కువసార్లు కూడా పరీక్షల్ని నిర్వహించొచ్చు. ఎవరైనా ఆటగాడు బయో బబుల్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే.. వారం పాటు సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లాల్సి ఉంటుంది.

ఆ తర్వాత వరుసగా రెండుసార్లు నెగిటివ్ పరీక్షలు వస్తేనే ఓకే చేస్తారు. మరీ.. టోర్నీ కోసం వెళ్లే ఆటగాళ్ల వెంట వారి కుటుంబ సభ్యులు ఉండొచ్చా? అంటే.. ఆయా జట్ల ఫ్రాంచైజీలతో తుది నిర్ణయంగా చెబుతున్నారు. ఒకవేళ వారిని అనుమతిస్తే.. ఆటగాళ్లకు ఏ విధంగా అయితే బయో సెక్యుర్ నిబంధనలు వర్తిస్తాయో.. వీరికి కూడా అలాంటివే ఉంటాయట. ఇన్నిసార్లు పరీక్షలు చేయించుకునే బదులు ఇంట్లోనే ఉంటామని క్రికెటర్ల కుటుంబ సభ్యులు చెబుతారేమో? ఇదంతా చూసినప్పుడు కరోనా వేళ క్రికెట్ టోర్నీ ఆడటం అంత తేలికైన విషయం కాదన్న భావన కలగటం ఖాయం.