అసలది టి20నా..? టెస్ట్20నా? అన్నట్లు సాగిన లక్నో టి20 మ్యాచ్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. సూర్యకుమార్ హార్దిక్ పాండ్యాలాంటి హిట్టర్లు క్రీజులో ఉండగా 100 పరుగుల లక్ష్యం ఛేదించడమే కష్టమైపోయింది. బౌండరీలు కనాకష్టంగా వస్తే.. ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు. టి20ల్లో 200 వన్డేల్లో 400 పరుగులు సహజంగా మారిన ఈ రోజుల్లో.. అలాంటి పిచ్ ఏమిటని విస్తుపోవడం ప్రేక్షకులు అభిమానుల వంతైంది. మరొక్క బంతి మాత్రమే మిగిలి ఉండగా భారత్ గెలిచి ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ మ్యాచ్ లో గనుక ఓడిపోయి ఉంటే విమర్శలను ఎదుర్కొనాల్సి వచ్చేది. దీనికితోడు సిరీస్ కూడా కోల్పోయేది. ఈ నేపథ్యంలో బీసీసీఐ చర్యలకు దిగింది.
క్యూరేటర్ బలి.. ''ఈ పిచ్ షాక్ కొట్టించింది''.. ఇదీ టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట. వాస్తవానికి పిచ్ అలానే ఉంది. ఒక్కో పరుగుకు కష్టపడాల్సి వచ్చింది. అభిమానులు మైదానానికి వచ్చేదే మ్యాచ్ మజా చేసేందుకు. అందులోనూ టి20లంటే పరుగుల ప్రవాహాన్ని ఆశిస్తారు. అయితే లక్నోలో మంచు ప్రభావం ఉందని సరిపెట్టుకోవడానికి కూడా వీల్లేనంత చప్పగా సాగింది మ్యాచ్. మొత్తానికి కోరుకున్నదానికి పూర్తి భిన్నంగా లక్నో మైదానం పిచ్ ఉంది. దీనికి ప్రతిఫలంగా క్యూరేటర్ పై వేటు పడింది. ఆయన స్థానంలో సంజీవ్ కుమార్ అగర్వాల్ ను కొత్త క్యూరేటర్ గా నియమించారు.
అసలు పిచ్ ఎందుకలా?
లక్నో పిచ్ ప్రవర్తించిన తీరు అభిమానులకే కాదు బీసీసీఐనీ షాకింగ్ కు గురిచేసినట్లుంది. అందుకే క్యూరేటర్ ను తీసేసింది. వాస్తవానికి ఈ మైదానంలోని అన్ని సెంటర్ పిచ్ ల మీద ఇటీవల వరుసగా దేశవాళీ మ్యాచ్ లు జరిగాయి. ఇక్కడే పొరపాటు జరిగింది. అంతర్జాతీయ మ్యాచ్ ఉందని తెలిసి కూడా క్యూరేటర్ కనీసం ఒకటి రెండు స్ట్రిప్ లను వదిలి పెట్టలేదు. దీనికి అననుకూల వాతావరణం తోడైంది. మరోవైపు అంతర్జాతీయమ్యాచ్ సమయానికి కొత్త పిచ్ ను తయారు చేసేంత టైమ్ లేకపోయింది. దీంతో పాతబడిన వికెట్ మీదనే మ్యాచ్ ఆడించారు.
టీమిండియా బౌలింగ్ కోచ్ సైతం..ఇక రెండో టి20 జరిగిన పిచ్ గురించి క్యురేటరే సరైన సమాధానం చెప్పగలడని టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రె అన్నాడు. బంతి విపరీతంగా స్పిన్ తిరిగిన ఈ పిచ్పై రెండు జట్ల బ్యాటర్లు స్కోరు చేసేందుకు చాలా కష్టపడ్డారు. ''ఏకనా పిచ్పై క్యురేటరే స్పందించాలి. రెండు జట్లకు ఈ పిచ్ సవాల్ విసిరింది. అదృష్టవశాత్తూ ఆఖర్లో భారత్ మ్యాచ్పై నియంత్రణ సాధించింది.
మొదట ఈ పిచ్ను చూసినప్పుడు ఎండినట్లు కనిపించింది. మధ్యలో కొంచెం గడ్డి కూడా ఉంది. మ్యాచ్ రోజు మాత్రం మొత్తం మారిపోయింది. బంతి అనూహ్యంగా తిరిగింది'' అని మాంబ్రె అన్నాడు. కాగా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అయితే మరింత వ్యంగ్యంగా స్పందించాడు. ''12 రోజులు ముందుగానే వచ్చేశామా..?'' అని ఎద్దేవా చేశాడు. ఫిబ్రవరి 9 నుంచి భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో అతడీ కామెంట్లు చేశాడు. అంటే లక్నో పిచ్ టెస్టులకు పనికొచ్చేదిలా ఉంది అని జాఫర్ అర్థం. తొలి రెండు టీ20ల్లో పిచ్ పరిస్థితితో అభిమానుల్లో తీవ్ర నిరాశ ఎదురైందని జాఫర్ తెలిపాడు.
అందుకే కీలకమైన చివరి మ్యాచ్ జరిగే అహ్మదాబాద్లోనైనా మంచి వికెట్ను తయారు చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ''అహ్మదాబాద్ పిచ్ అయినా బాగుంటుందనే నమ్మకం ఉంది. తప్పకుండా మంచి గేమ్ అవుతుందని భావిస్తున్నా. లఖ్నవూలో మాదిరిగా ఇక్కడా మరీ ఎక్కువగా స్పిన్ అయితే ఆశ్చర్యపోవడం అవుతుంది. సాధారణంగా అహ్మదాబాద్లో గతంలో చాలా అద్భుతమైన మ్యాచ్లను చూశాం. కనీసం ఇక్కడ 170 పరుగుల వరకు స్కోరు చేస్తారని ఆశిస్తున్నా. గత రెండు మ్యాచులతో పోలిస్తే ఇక్కడ కాస్త మెరుగైన ఆటను వీక్షించొచ్చు'' అని జాఫర్ వెల్లడించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.