Begin typing your search above and press return to search.

కళ్లు మూసుకుని చెప్పొచ్చు.. ఔట్ అని? కానీ, డీఆర్ఎస్ కు ధోనీ లేడుగా?

By:  Tupaki Desk   |   22 Sep 2022 1:30 PM GMT
కళ్లు మూసుకుని చెప్పొచ్చు.. ఔట్ అని? కానీ, డీఆర్ఎస్ కు ధోనీ లేడుగా?
X
ఆస్ట్రేలియాతో మంగళవారం మొహాలీలో జరిగిన తొలి టి20లో టీమిండియా 208 పరుగులు చేసి మరీ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ లో వెనుకబడినా సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా దయతో 208 పరుగులు చేసిన రోహిత్ సేన.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ఇందుకు బౌలింగ్ బలహీనంగా ఉండడంతో పాటు ఫీల్డింగ్ నాసిరకంగా ఉందనే విమర్శలు వచ్చాయి. అందుకనే భారీ లక్ష్యం విధించిన సులువుగా గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయిందనే వ్యాఖ్యలు వినిపించాయి.

వికెట్ల వెనుక కీపర్.. ముందు బౌలర్ అది మ్యాచ్ లో ఐదో ఓవర్. ఆసీస్ ఓపెనర్లు కెప్టెన్ అరోన్ ఫించ్, కామెరాన్ గ్రీన్ భారత పేసర్లు భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ లను చితగ్గొడుతుండడంతో రోహిత్ శర్మ.. స్పిన్నర్ చాహల్ ను రంగంలోకి దించాడు. చాహల్ వేసిన మూడో బంతి గ్రీన్‌ ప్యాడ్‌కు తాకింది. బంతి లైన్ లోనే పిచ్ అయింది. వికెట్లను గిరాటేస్తోంది. దీన్నిబట్టి అంపైర్ ఔట్ ఇవ్వొచ్చు. కానీ, ఫీల్డ్ అంపైర్ ఇవ్వలేదు. భారత్ ఆటగాళ్లెవరూ కనీసం రివ్యూ కోరలేదు.

ఓవేళ రివ్యూ కోరినా గ్రీన్ ఔటని కచ్చితంగా నిర్ణయం వచ్చేది. వాస్తవానికి అంపైర్ ఔట్ ఇవ్వకున్నా.. బంతి పడిన విధానం.. వికెట్లను తాకుతుందా? లేదా? అనేదానిని బట్టి బౌలర్, వికెట్ కీపర్ అప్పీల్ కు వెళ్లాలి. కానీ, బౌలర్ చాహల్ కానీ, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కానీ ఆ పనిచేయలేదు. దీంతో గ్రీన్ బతికిపోయాడు. ఆ అవకాశంతో మరింత చెలరేగాడు. మరోవైపు ఐదో ఓవర్ లో జరిగిన ఈ సంఘటన గురించి ఆరో ఓవర్‌ సమయంలో రిప్లై చూపించగా.. గ్రీన్‌ ఎల్‌బీడబ్ల్యూగా తేలింది. దీంతో చాహల్‌, రోహిత్‌, దినేశ్‌ కార్తిక్‌ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొన్నారు. అలా అందివచ్చిన అవకాశం టీమిండియా చేజారింది. గ్రీన్‌ 30 బంతుల్లో 61 పరుగులు చేసి ఆసీస్‌ను పోటీలో నిలబెట్టాడు. ఇవే కాదు.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్, హర్షల్ ఓ రిటర్న్ క్యాచ్ ను జారవిడవడం కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది.

అదే ధోని ఉండి ఉంటేనా..?ఆసీస్ తో మ్యాచ్ లో గ్రీన్ ఎల్బీ అయిన సంగతిని గుర్తించలేకపోవడం వికెట్ కీపర్ తప్పిదమే. అదే స్థానంలో గనుక ధోనీ ఉండి ఉంటే కచ్చితంగా రివ్యూ కోరి ఉండేవాడు. బంతి పిచ్ అయిన తీరును పసిగట్టి వికెట్లను తాకుతుందా? లేదా అని ధోనీ కచ్చితంగా గుర్తిస్తాడు. తన కెప్టెన్సీలోనే కాదు.. కోహ్లి కెప్టెన్ గా ఉన్నప్పుడూ ధోనీ ఇలాంటి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించాడు.అందుకే డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)ను ధోనీ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) అని వ్యాఖ్యానించేవారు. ఇక ధోనీ వికెట్ల వెనుక ఎంతటి కీలకమో 2016 టి20 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ తో వ్యవహరించిన తీరే చెబుతుంది. మ్యాచ్ పూర్తిగా చేజారిందనుకుంటున్న పరిస్థితుల్లో చివరి ఓవర్ ను హార్డిక్ పాండ్యా కు ఇచ్చి.. గ్లోవ్స్ తీసేసి రనౌట్ చేసిన విధానం క్రికెట్ అభిమానుల ఎవరూ మర్చిపోలేరు. అందుకనే.. ఆసీస్ తో మ్యాచ్ అనంతరం సీనియర్లు ధోనీ గురించి ప్రస్తావన తెచ్చారు.

కీపర్ చేయాల్సింది అదే కదా..?ఆసీస్ తో తొలి టి20కి టీమిండియా యువ రిషభ్ పంత్ ను కాదని సీనియర్ దినేశ్ కార్తీక్ ను వికెట్ కీపర్ గా తీసుకుంది. కార్తీక్ ప్రతిభావంతుడే. అందులో సందేహం లేదు. కానీ, ఈ మ్యాచ్ లో బ్యాట్ తోనూ విఫలమయ్యాడు. గ్రీన్ ఎల్బీడబ్ల్యూ విషయంలో నిర్లిప్తంగా ఉన్న అతడు.. స్టీవ్ స్మిత్ క్యాచ్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాడు. కానీ, మొదటి దానికే ఎక్కువ నష్టం జరిగింది.

ఈ ఎల్‌బీడబ్ల్యూ అవకాశాన్ని గుర్తించకపోవడంపై మ్యాచ్‌ కామెంటేటర్లుగా ఉన్న సునీల్‌ గావస్కర్‌, రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. "వికెట్‌ కీపర్లు పోషించాల్సిన అత్యంత ముఖ్యమైన పాత్ర ఇదే. ఈ విషయంలో ధోనీ ఎంతో ఉత్తమంగా వ్యవహరించేవాడు’రవిశాస్త్రి అన్నాడు. అతడు కోచ్ గా ఉన్న సమయంలో ధోనీ టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించాడు.

కీపర్ల తలనొప్పులు వికెట్ కీపర్ల విషయంలో భారత జట్టుకు కొత్త కొత్త తలనొప్పులు తప్పేలా లేవు. ఒకప్పుడు బ్యాటింగ్ చేయగల కీపర్ కోసం వెంపర్లాడగా, ధోనీ రాకతో ఆ లోటు తీరింది. అయితే, ఇప్పడు కీపర్లు ఎక్కువై ఎంపిక సమస్యగా మారింది. రిషబ్ పంత్ ను ఎంచుకోవాలా? లేక కార్తీక్ వైపు మొగ్గుచూపాలా తెలియడం లేదు. పంత్ టి20ల్లో ఆకట్టుకోవడం లేదు. కార్తీక్ ను ఫినిషర్ గా జట్టు చూస్తోంది. వీరికితోడు ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ తామంటే తామని తలుపుతడుతున్నారు. వీరిద్దరూ హార్డ్ హిట్టర్లే. ఓపెనర్లగానూ పనికొచ్చే ఆటగాళ్లు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.