Begin typing your search above and press return to search.

ఏపీలోని 161 కేసుల్లో 140 కేసులకు ఢిల్లీ లింక్

By:  Tupaki Desk   |   3 April 2020 4:30 PM GMT
ఏపీలోని 161 కేసుల్లో 140 కేసులకు ఢిల్లీ లింక్
X
కరోనాపై పోరులో లాక్ డౌన్ సత్ఫలితాలనిస్తుందనుకుంటున్న తరుణంలో ఢిల్లీలోని తబ్లిగ్ సదస్సు ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ సదస్సులో పాల్గొని తమ తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్లిన వారు కరోనా వైరస్ వాహకులుగా మారడంతో ఆయా రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. మరీ ముఖ్యంగా ఏపీలో కరోనా అదుపులో ఉందనుకుంటున్న సమయంలో ఢిల్లీ ఉదంతం నేపథ్యంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఢిల్లీ ఉదంతానికి ముందు 23గా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తాజాాగా 161కు చేరుకుంది. వాటిలో 140 కేసులు ఢిల్లీతో లింకు ఉన్నవే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు - లాక్‌ డౌన్‌ అమలవుతున్న తీరు - రాష్ట్రంలో వాలంటీర్లు - ఏఎన్‌ ఎం - ఆశా వర్కర్లు నిర్వహించిన ఇంటింటికీ సర్వే - ప్రజల సహకారం - నిత్యావసర సరుకుల ధరలు - క్వారంటైన్‌ లు - వృద్ధాశ్రమాలు - శిశు సదనాల్లో అందుతున్న మెనూపై చర్చ జరిపారు. ఏపీలో మొత్తం 161 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని - 161 కేసుల్లో 140 మంది ఢిల్లీలోని సదస్సుకు వెళ్లినవారేనని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏపీ నుంచి ఢిల్లీకి మొత్తం 1085 మంది వెళ్లారని - వారిలో 946 మందిని గుర్తించామన్నారు. 946 మందిలో 881 మందికి పరీక్షలు చేయగా 108 మందికి పాజిటివ్‌ అని తేలిందని అన్నారు. 881 మందిలో 65 మంది ఫలితాలు రావాల్సి ఉందని - మిగతా వారందరికీ నెగెటివ్ వచ్చిందని చెప్పారు. వారితో కాంటాక్ట్‌ అయిన 613 మందికి పరీక్షలు చేయగా 32 మందికి పాజిటివ్‌ వచ్చిందని - 335 మంది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. మిగతా వారికి నెగటివ్ వచ్చిందని అన్నారు.

ఏపీలో 1.28 కోట్ల కుటుంబాల సర్వే పూర్తయిందని - కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ లను పెంచామని చెప్పారు. గుంటూరు - కడపలో కూడా కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ లు ఏర్పాటు చేస్తామని - సోమవారం నుంచి ఏడు ల్యాబ్‌ లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. అవసరమైతే ప్రైవేట్‌ ల్యాబ్‌ ల సాయం కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు నాని చెప్పారు. కాగా - రాష్ట్రంలో కరోనా కారణంగా తొలి మరణం సంభవించింది. విజయవాడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 17న ఢిల్లీ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా తండ్రి అయిన ఆ వ్యక్తికి కరోనా సోకింది. మార్చి 30 మధ్యాహ్నం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందంటూ ఆ వ్యక్తి ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. చేరిన గంటకే అతడు మరణించాడని - అనుమానం వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్య అధికారులు తెలిపారు. ఆ తండ్రి - కుమారుడితో కాంటాక్ట్ లోకి వచ్చిన 29 మందిని క్వారంటైన్ కు తరలించామని అధికారులు తెలిపారు. ఏపీలో కరోనా కారణంగా తొలి మరణం సంభవించడంతో... విజయవాడ వాసులు హడలి పోతున్నారు. ఎంతమందికి వైరస్ సోకిందో అని ఆందోళన చెందుతున్నారు.