మద్రాస్ ఐఐటీలో రాలిన తెలుగు విద్యాకుసుమం

Tue Sep 22 2015 22:04:30 GMT+0530 (IST)

IIT-Madras student commits suicide, found hanging in his room

ఐఐటీలో చదివేందుకు అర్హత సాధించడమంటే సామాన్యమైన విషయం కాదు. అక్కడ సీటు కొట్టాలంటే విద్యార్థులు రాత్రిపగలు కష్టపడి చదివి..రక్తాన్ని ఆవిరి చేస్తే కాని సీటు రాదు. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో చదవాలన్న లక్ష్యంతో అహర్నిశలు శ్రమించి సీటు కొట్టిన ఓ తెలుగు విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ చదువుతున్న కడప జిల్లాకు చెందిన విద్యార్థి నాగేంద్ర కుమార్ రెడ్డి (23) ఆత్మహత్య చేసుకున్నాడు. వినాయకచవితి పండుగ సందర్భంగా రాయచోటి మండలం శేషాపురంలోని తన ఇంటికి వచ్చి వెళ్లిన నాగేంద్ర ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.  గేట్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడమే నాగేంద్ర ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. అయితే నాగేంద్రకుమార్ రెడ్డి తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని...దీని వెనక ఏదైనా సంఘటన జరిగి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం నాగేంద్ర హాస్టల్ లోని తన గదిలో నుంచి ఎంత సేపటకీ బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు లోపలకు చూడగా నాగేంద్ర సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. సహ విద్యార్థులు ఈ విషయాన్ని వెంటనే ఐఐటీ ఉన్నతాధికారులకు చేరవేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నాగేంద్ర కుమార్ రెడ్డి ఆత్మహత్య ప్రదేశం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. అక్కడ సూసైడ్ నోట్ కూడా లభ్యంకాకపోవడంతో ఆత్మహత్యకు  ఇతర కారణాలు ఏంటన్నదితెలియడం లేదు. ఐఐటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగేంద్రకుమార్ రెడ్డి గేట్ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడమే ఈ సంఘటనకు కారణం అనుకుంటున్న టైంలో మృతిడి తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడిది ఆత్మహత్య కాదని ఆరోపిస్తుండడంతో  పోలీసులు ఈ కేసు గురించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.