Begin typing your search above and press return to search.

జాదవ్ కేసు సాల్వ్ చేసిన..ఈ సాల్వే ఎవరంటే?

By:  Tupaki Desk   |   17 July 2019 5:42 PM GMT
జాదవ్ కేసు సాల్వ్ చేసిన..ఈ సాల్వే ఎవరంటే?
X
గూఢచర్య ఆరోపణల కింద పాకిస్థాన్ కోర్టు ఉరి శిక్షను ఖరారు చేసిన భారత వాయుసేన మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ ను ఉరి కంబం నుంచి దించేసి, త్వరలోనే భారత్ కు తీసుకొచ్చేలా కీలక పరిణామాలకు కారణంగా నిలిచింది ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే. హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో బుధవారం జరిగిన కీలక విచారణలో భారత్ తరఫున తనదైన శైలి వాదనలు వినిపించిన సాల్వే... ఒంటెత్తు పోకడలు పోతున్న పాకిస్థాన్ ను దిగొచ్చేలా చేశారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు జాదవ్ కేసును టేకప్ చేసిన సాల్వే... ఇప్పటికే ఉరి శిక్షను నిలిపివేయించారు. తాజాగా ఈ కేసును పాక్ పున:సమీక్షించేలా అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి తీర్పు వచ్చేలానూ చేశారు. జాదవ్ కేసుతో మరోమారు వార్తల్లో నిలిచిన సాల్వే గురించి చాలా విషయాలే చెప్పుకోవాలి.

మహారాష్ట్రకు చెందిన సాల్వే... తండ్రి మాదిరే సీఏ చేశారు. అయితే తాత వృత్తి అయిన ప్లీడర్ గా మారారు. రాజ్యాంగ సంబంధ కేసులు, కమర్షియల్ ట్యాక్స్ సంబంధిత కేసుల్లో ప్రావీణ్యం సంపాదించిన సాల్వే... అంచెలంచెలుగానే ఎదిగారు. కాలక్రమంలో సుప్రీంకోర్టుకు చేరిన సాల్వే... చాలా కీలక కేసులను టేకప్ చేసి విజయం సాధించారు. 1955 జూన్ 22న జన్మించిన సాల్వే.... సుప్రీంకోర్టులో తన వాదనలతో సత్తా చాటి 1999లో సొలిసిటర్ జనరల్ పదవికి ఎంపికయ్యారు. 2002 దాకా ఆ పదవిలో కొనసాగిన సాల్వే... కేంద్ర ప్రభుత్వ వాదనలను కోర్టుల్లో తనదైన శైలిలో వాదించి మెప్పించారు. ఆ తర్వాత కూడా దేశంలోనే కీలక కేసులుగా పరిగణించిన పలు కేసులను టేకప్ చేసిన సాల్వే.. తన క్లయింట్లకు విజయాన్నే అందించారు.

సాల్వే వాదించిన కేసుల్లో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై నమోదైన హిట్ అండ్ రన్ కేసు కూడా ఉంది. మద్యం మత్తులో కారును నడిపి ఫుట్ పాత్ పై పడుకున్న వారిపైకి కారును ఎక్కించి పలువురి మృతికి కారణమయ్యారన్న కేసులో సల్మాన్ చాలా కాలం పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. సాల్వే ఈ కేసును టేకప్ చేసి... సల్మాన్ ను ఈ కేసులో నిర్దోషిగా బయటపడేయించారు. దీంతో మరోమారు సాల్వే పేరు మారుమోగిపోయింది. సాల్వే కేసు టేకప్ చేశారంటే... అవతలి వర్గం ఆశలు వదులుకోవాల్సిందేనన్న వాదన కూడా వినిపించింది. ఈ క్రమంలో సాల్వే సత్తాను గుర్తించిన భారత ప్రభుత్వం... జాదవ్ కేసును కూడా ఆయనకే అప్పగించింది. కేంద్రం అభ్యర్థనతో టేకప్ చేసిన ఈ కేసులో ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని వాదనలు వినిపిస్తానని సంచలన ప్రకటన చేసిన సాల్వే... పాక్ కు తన వాదనలతో చుక్కలు చూపించారు.

కేసు టేకప్ చేసిన మరుక్షణమే జాదవ్ కు ఖరారైన ఉరి శిక్ష అమలును నిలిపివేయించిన సాల్వే... బుధవారం నాటి విచారణలో పాక్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. సాల్వే సంధించిన ప్రశ్నలతో పాక్ తరఫు లాయర్లు తెల్ల ముఖాలు వేశారు. సాల్వే తనదైన శైలి వాదనలు వినిపించి... అంతర్జాతీయ కోర్టు ధర్మాసనంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్ కు అనుకూలంగా తీర్పు వెలువరించేలా చేశారని చెప్పాలి. ఇప్పటిదాకా చేపట్టిన కేసులేమో గానీ... జాదవ్ కేసులో విజయం సాధించడం ద్వారా సాల్వే పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది.