తెలంగాణ చేనేతకు సరికొత్త బ్రాండ్ అంబాసిడర్లు.. ఊహించని రీతిలో రెస్పాన్స్

Tue Aug 16 2022 12:36:41 GMT+0530 (IST)

IASs who have become brand ambassadors for Telangana weavers

తెలంగాణ చేనేతకు సరికొత్త బ్రాండ్ ను తీసుకొచ్చారు మహిళా ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు. ఈ విషయంలో క్రెడిట్ మొత్తం తెలంగాణ సీఎంవోలో కీలకభూమిక పోషించే స్మిత సభర్వాల్ కు ఇవ్వాల్సిందే. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. కేసీఆర్ సర్కారు కొలువు తీరిన కొత్తల్లో తెలంగాణ చేనేతకు బ్రాండ్  అంబాసిడర్ గా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి.. హైదరాబాదీ అయిన సానియామీర్జాను ఎంపిక చేయటం అందుకోసం ఆమెకు రూ.కోటి పారితోషికంగా ఇవ్వటం తెలిసిందే. అప్పటికే ఆటతో ఫేమస్ అయి.. పెద్ద ఎత్తున సంపాదిస్తున్న ఆమెకు ప్రోత్సాహకంగా ఉండేందుకు మరింత డబ్బును అందజేయటం తెలిసిందే.

కట్ చేస్తే.. అంత డబ్బులు తీసుకొని.. సానియా మీర్జా తెలంగాణ చేనేతకు ఏం చేశారు? అన్న ప్రశ్న వేస్తే.. సమాధానం రాని పరిస్థితి. ప్రజల పన్ను సొమ్మును పందారం చేసినట్లుగా సానియాను బ్రాండ్ అంబాసిడర్ గా ఏర్పాటు చేసి డబ్బులు పోగొట్టుకున్న వేళ.. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా.. తెలంగాణ చేనేతకు సరికొత్త ఇమేజ్ తీసుకురావాలన్న తపనతో ఐఏఎస్ అధికారిణిగా ఉన్న స్మిత సభర్వాల్ వ్యవహరించిన తీరు  ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు ఆమెను మనస్ఫూర్తిగా అభినందించాలన్న భావన కలిగేలా చేస్తోంది.

ఇటీవల ఆమె ఒక చక్కటి చేనేత చీరను ధరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చేనేతను ప్రమోట్ చేసేలా ఉన్న ఆ ఫోటోకు నెటిజన్లు పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందించారు. ఫోటోను పోస్టు చేయటంతో ఆగకుండా.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు మరికొందరు ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులకు చేనేత వస్త్రాల్ని ధరించాలని సవాలు విసిరారు.

ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన వారు తమకు నచ్చిన చేనేత వస్త్రాల్ని ధరించి సోషల్ మీడియాలో సందడి చేశారు. దీంతో.. ఇప్పుడు చేనేత వస్త్రాల మీద మరోసారి చర్చ మొదలైంది. స్మిత సభర్వాల్ మొదలు పెట్టిన ఈ సవాల్ కు స్పందించిన మరికొందరు మహిళా ఐఏఎస్ అధికారిణులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

వారికి ఐపీఎస్ లు తోడయ్యారు. కలెక్టర్లుగా వ్యవహరిస్తున్న హరిచందన.. శిక్తా పట్నాయక్.. ప్రమీలా సత్పతి.. శిఖాగోయల్.. స్వాతిలక్రా.. తదితరులు తమకు నచ్చిన చేనేత చీరలను ధరించి ప్రతి ఛాలెంజ్ విసురుతున్నారు. దీంతో.. తెలంగాణ చేనేతకు సరికొత్త ఇమేజ్ పెరగటమే కాదు.. డిమాండ్ పెరిగినట్లుగా చెబుతున్నారు.