ఆరేళ్ల వయసులో ఇద్దరు వేధించారు.. ఆ జిల్లా కలెక్టర్ షాకింగ్ వ్యాఖ్యలు

Thu Mar 30 2023 10:09:02 GMT+0530 (India Standard Time)

IAS Divya S Iyer Reveals She is Molested

షాకింగ్ వ్యాఖ్యలు చేశారు కేరళకు చెందిన పథనంథిట్ట కలెక్టర్ గా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారిణి దివ్య ఎస్ అయ్యర్. తన బాల్యం గురించి చెప్పిన క్రమంలో ఆమె చెప్పిన మాటలు విన్న వారు విస్మయానికి గురవుతున్నారు. ఆమె ధైర్యానికి మెచ్చుకోవటమే కాదు.. సమాజంలో చోటు చేసుకునే ఈ తరహా వేధింపులకు కఠిన చర్యలు ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.



కేరళ రాష్ట్ర యువజన సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆమె తన గతం గురించి చెబుతూ.. తానెంత హింసకు గురైన విషయాన్ని వెల్లడించారు.

ఆరేళ్ల వయసులో ఇద్దరు వ్యక్తులు తనను అప్యాయంగా పిలిచారని.. దీంతో వారి వద్దనకు తాను వెళ్లానని.. అయితే వారు తనను అభ్యంతరకరంగా తడుముతూ చేసిన పనులు ఎందుకన్నది తనకు ఆ వయసులో అస్సలు అర్థం కాలేదన్నారు. అప్యాయంగా మాట్లాడుతూనే.. వారి చేష్టలు తనను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశాయన్నారు. వారు తన దుస్తుల్ని విప్పినప్పుడు బాధగా అనిపించిందని.. అయితే తాను వారి నుంచి పారిపోయినట్లుగా పేర్కొన్నారు.

తన తల్లిదండ్రుల సహకారంతో తాను తన బాధను తప్పించుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత వారు ఎక్కడైనా కనిపిస్తారేమోనని చూశానని.. కానీ వారు కనిపించలేదని పేర్కొన్నారు. ఇప్పటికి వారి ముఖాలు తనకు గుర్తు ఉన్నాయన్న ఆమె.. తన బాల్యంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వివరించారు.

ఈ ఉదంతంతో తాను తన చిన్నతనంతో విపరీతమైన మానసిక క్షోభకు గురైనట్లు చెప్పారు. ఈ తరహా ఘటనలు చిన్నారులకు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. బంధువులు.. ఇతర వ్యక్తులు తమ చిన్నారుల విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారన్న విషయంపై ఒక కన్నేసి ఉండటం అవసరం అంటున్నారు.

అదే సమయంలో అప్పటివరకు చురుగ్గా..హుషారుగా ఉండే పిల్లలు ఒక్కసారిగా కామ్ అయిపోయినా.. వారి వ్యవహారశైలిలో తేడా వచ్చినా వారితో అనునయంగా మాట్లాడుతూ.. వివరాల్ని సేకరించటంతో పాటు.. వారికి తాము అండగా ఉన్నామన్న విషయాన్ని స్పష్టం చేయాలన్న మాట వినిపిస్తోంది. పథనంథిట్ట కలెక్టర్ మాదిరి పలువురు తమ బాల్యంలో ఎదురైన చేదు అనుభవాల గురించి ఓపెన్ గా మాట్లాడాల్సిన అవసరంఉందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.