వర్షం వేళ.. గర్భిణి కోసం ప్రత్యేకంగా రైలు నడిపిన హైదరాబాద్ మెట్రో

Sat Oct 17 2020 13:40:20 GMT+0530 (IST)

When it rains .. Hyderabad Metro runs a train especially for pregnant women

కలలో కూడా ఊహించలేని కొన్ని ఉదంతాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటుంటాయి. అయితే.. అలాంటివి మీడియాలో ఫోకస్ కాకపోవటం వల్ల ప్రజలకు తెలీకుండా పోతుంటాయి. మంచి జరిగినప్పుడు.. ఆ విషయాల్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. తాజాగా ఒక వార్త విషయంలో తెలుగు మీడియా ప్రదర్శించిన నిర్లక్ష్యం చూస్తే.. నోట మాట రాదంతే.హైదరాబాద్ మహానగరాన్ని ఆగమాగం చేసిన భారీ వర్షాల వేళ.. ఇల్లు వదిలి బయట రాలేని పరిస్థితి. జోరుగా వర్షం పడుతున్న వేళ.. రోడ్ల మీదకుపెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి. అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయాందోళనకు గురయ్యే పరిస్థితి. ఇక.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిన పరిస్థితి. ఇలాంటివేళ.. పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకున్న హైదరాబాద్ మెట్రో మానవత్వాన్ని ప్రదర్శిస్తోంది.

ఈ నెల 14వ తేదీ రాత్రి వేళలో ఒక గర్భిణి మెట్రో స్టేషన్ కు వచ్చారు. ఆ సమయంలో మెట్రో రైలు లేదు.అయితే.. ఆమె తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రికి వెళ్లాల్సి ఉన్నా..రోడ్డు మార్గం ప్రయాణానికి అవకాశం లేకపోవటం.. ఆమె సురక్షితంగా ఆసుపత్రికి చేర్చాలంటే మెట్రోకి మించిన రవాణా సదుపాయం అప్పటికైతే లేదు. దిల్ సుఖ్ నగర్ - ఎల్ బీనగర్ మధ్యలో ఉన్న విక్టోరియా మెమోరియల్ స్టేషన్ వద్దకు వచ్చిన ఆమె విషయంలో మెట్రోరైలు సిబ్బంది అనూహ్యంగా వ్యవహరించారు.

ఆమె సమస్యను అర్థం చేసుకున్న మెట్రో రైల్ సిబ్బంది .. ప్రత్యేకంగా ఒక రైలును అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ఆమెను రైల్లో ఆమె కోరుకున్న చోటకు చేర్చారు. ఈ ఉదంతం పెద్దగా ఫోకస్ కాలేదు. అయితే.. ఈ విషయాన్ని వెల్లడించిన హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరైనా సరే విపత్తు వేళ.. అనుకోకుండా ఎదురైన సమస్యకు పరిష్కారంగా మెట్రో సాయంగా ఉంటుందని పేర్కొన్నారు. అత్యవసరమైనప్పుడు బాధితులకు మెట్రో అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో హైదరాబాద్ మెట్రోను పొగడాల్సిందే.