స్పీకర్ నోటీసులపై కోర్టుకు కేసీఆర్ సర్కార్

Thu Aug 16 2018 13:24:14 GMT+0530 (India Standard Time)

Hyderabad High Court Admits TRS Govt Plea On Notices TO Telangana Speaker

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని విషయాల్లోఎంత పట్టుదలగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తాను పర్సనల్ గా తీసుకున్న విషయాల మీద ఎంతవరకైనా సరే.. అన్నట్లుగా ఉంటుంది ఆయన తీరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. సంపత్ కుమార్ ల సభాబహిష్కరణలపై సీఎం ఎంత పట్టుదలగా ఉన్నారన్న విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంటుంది.ఈ ఎపిసోడ్ మొదలు నుంచి తనను వేలెత్తి చూపిస్తున్నా.. కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి. ఈ వ్యవహారంలో మొదట్నించి మొట్టికాయలు పడుతున్నా.. ముందుకు వెళుతున్న కేసీఆర్.. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కోమటిరెడ్డి.. సంపత్ ల వ్యవహారశైలి బాగోలేదని.. మైకు విసిరారంటూ సభ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లుగా ప్రకటిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై కోమటిరెడ్డి.. సంపత్ లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు సరికాదని.. వారి స్థానాలు ఖాళీ అయినట్లుగా ప్రకటించటం సరికాదంటూ హైకోర్టు తీర్పును ఇచ్చింది.

తాను ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవటంపై తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని ప్రశ్నించటమే కాదు.. రీసెంట్ గా షాకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. స్పీకర్ కు ఇచ్చిన సోకాజ్ నోటీసులపై స్పందిస్తూ.. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ కు అప్పీలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  మొదట్నించి ఎదురుదెబ్బలు తగులుతున్నా.. వెనక్కి తగ్గకుండా.. ఇప్పటికి పోరాటం చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ తీరు పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం  చేసిన అప్పీల్.. ఆగస్టు 21న విచారణకు రానుంది. ఈ ఉదంతం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.