ప్రపంచంలోనే అగ్రస్థానంలో హైదరాబాద్..ది గ్రేట్ డైనమిక్ సిటీ

Mon Jan 20 2020 21:31:02 GMT+0530 (IST)

Hyderabad, Bengaluru top two most dynamic cities globally in list of 130: JLL

ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్ సేవల సంస్థ జేఎల్ ఎల్ రూపొందించిన ప్రపంచ అత్యంత క్రియాశీల నగరాల జాబితాలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 2020 సంవత్సరానికి గాను ప్రకటించిన ఈ జాబితాలో ప్రపంచంలోనే మోస్ట్ డైనమిక్ సిటీగా కీర్తించబడింది. దీంతో భాగ్యనగర ఖ్యాతి ఎల్లలు దాటింది.రియల్ ఎస్టేట్ రంగంలో పేరొందిన జేఎల్ ఎల్(జోన్స్ ల్యాంగ్ లాసలె) సంస్థ ప్రపంచంలోని 130 నగరాలను అధ్యయనం చేసింది. సామాజిక ఆర్థిక వ్యవస్థ - స్థిరాస్తి  - వ్యాపార - ఉద్యోగ అవకాశాలు - ఉపాధి  ప్రామాణికంగా తీసుకొని నివేదిక రూపొందించింది.

జేఎల‌్ ఎల్ రూపొందించిన ఈ ''సిటీ మూమెంటమ్ ఇండెక్స్ 2020''ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రోజు ఆవిష్కరించారు. ఈ జాబితాలో టాప్ 20 స్థానాల్లో 7 భారతీయ నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో నిలవగా బెంగళూరు నగరం రెండో స్థానంలో నిలవడం విశేషం. ఇంకా ఈ జాబితాలో 5వ స్థానంలో చెన్నై - 7వ స్థానంలో ఢిల్లీ - 12వ స్థానంలో పూణె - 16వ స్థానంలో కోల్ కతా - 20వ స్థానంలో ముంబై నిలిచాయి. 
 
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ నగరం ఈ జాబితాలో లేదని ఆ తర్వాత టీఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా 2015లో 20వస్థానం - 2016లో 5వ స్థానం - 2017లో 3వ స్థానం - 2018లో మొదటి స్థానం - 2019లో రెండో స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 2020లో మరోసారి హైదరాబాద్ నగరం ఇలా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు.