Begin typing your search above and press return to search.

ఆక్సీజన్ అందక భార్య మృతి .. చెట్లు నాటుతోన్న భర్త , ఎందుకంటే !

By:  Tupaki Desk   |   19 Jun 2021 11:30 PM GMT
ఆక్సీజన్ అందక భార్య మృతి .. చెట్లు నాటుతోన్న భర్త , ఎందుకంటే !
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతటి అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా నమోదు కానీ పాజిటివ్ కేసులు మనదేశంలో నమోదు కావడం తో ఓ దశలో దేశంలో వైద్య సదుపాయాలు సరిపోని స్థితి. బెడ్ల కొరత , అలాగే ఆక్సీజన్ కొరత. ఆక్సిజన్ సరైన సమయానికి అందక కూడా కొందరు మృతి చెందిన విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాగే గుజరాత్ లోని అహ్మదాబాద్కు చెందిన నేహా కూడా ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఎంతో వేదన చెందిన ఆమె భర్త ధృవల్ పటేల్ అద్భుత కార్యక్రమం చేపట్టారు. ఆమె జ్ఞాపకంగా మొక్కలు నాటుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడం, ఆ సమయంలో కావాల్సినంత ఆక్సిజన్ దొరకకపోవడంతో మే 12న నేహా చనిపోయారు.

కరోనాతో పోరాడుతున్న సమయంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి తీవ్ర వేదన అనుభవించారు. దీంతో నేహా జ్ఞాపకంగా పర్యావరణ పరిరక్షణకు ఆమె భర్త ధృవల్, 15 ఏళ్ల కుమారుడు పూర్వ మొక్కలు నాటుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి 450కు పైగా మొక్కలు నాటారు. నేహా అంత్యక్రియలు నిర్వర్తించిన సిధ్ పూర్ లోనే ధృవల్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కనీసం మూడు మొక్కలు నాటాలని అంత్యక్రియలు చేసిన పురోహితుడు తనకు చెప్పారని ధృవల్ వెల్లడించారు. ఆ చెట్లు పెరిగాయక వచ్చిన కలప వేరే వారి అంత్యక్రియలు ఉపయోగపడుతుందని సూచించారని ఆయన చెప్పారు. దీంతో అక్కడ ధృవల్ మూడు మొక్కలు నాటారు. అయితే ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే .. సెకండ్ వేవ్ సమయంలో ధృవల్ కుటుంబంలో నలుగురు కరోనా బారిన పడ్డారు. ధృవల్ తో పాటు నేహా, ఆయన కుమారుడు, తండ్రి వైరస్ కు గురయ్యారు. వీరిలో నేహా ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. కరోనా బారిన పడిన మూడో రోజే ఆమెను ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. భార్య మృతి చెందిన విషాదం నుంచి తాను ఇంకా బయటికి రాలేకపోతున్నానని ధృవల్ చెప్పారు. తమ పెళ్లయి 17 సంవత్సరాలు అయిందని, ఎప్పుడూ వేరుగా ఉండలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. నేహా లేకుండా భవిష్యత్తును ఎప్పుడూ ఊహించుకోలేదని ఆవేదన చెందారు.