Begin typing your search above and press return to search.

మాస్కులు.. టాయిలెట్ పేపర్ల కోసం ఎంత డిమాండ్ అంటే?

By:  Tupaki Desk   |   20 Feb 2020 2:30 AM GMT
మాస్కులు.. టాయిలెట్ పేపర్ల కోసం ఎంత డిమాండ్ అంటే?
X
నాగరిక సమాజం లాంటి మాటలు అన్ని బాగున్న వరకే. ఎంత క్రమశిక్షణ కలిగిన సమాజమైనా.. విపత్కర పరిస్థితులు ముంచుకొస్తుంటే.. మనషుల్లోని లోపల గుణాలు ఇట్టే బయటకు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు జపాన్ లో అలాంటి పరిస్థితే నెలకొందన్న మాట వినిపిస్తోంది. మిగిలిన ఆసియా దేశాలతో పోలిస్తే.. జపనీయులకు ఓర్పు.. సహనం.. క్రమశిక్షణ చాలా ఎక్కువగా చెబుతుంటారు. వారు వేసే ప్రతి అడుగు ఆచితూచి అన్నట్లు ఉంటుందన్న గొప్పలు వినిపిస్తుంటాయి.

అలాంటి జపాన్ లో కోవిడ్ 18 వైరస్ పుణ్యమా అని.. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైనాలో పిశాచి వైరస్ పుణ్యమా అని మాస్కులు.. టాయిలెట్ పేపర్ల కొరత విపరీతంగా ఉంది. దీంతో.. మాస్కుల గిరాకీ భారీగా పెరిగిపోయింది. కోవిడ్ వైరస్ తీవ్రత ఆ బుల్లి దేశంలో పెద్దగా లేకున్నా.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా జపనీయులు మాస్కుల్ని.. టాయిలెట్ పేపర్లను కొనేస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోయి.. వాటి ధరలు బాగా పెరిగినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం జపాన్ లో 65 మాస్కులు ఉండే బాక్సు ధర ఏకంగా రూ.32 వేలు పలుకుతోంది. ఇదిలా ఉంటే మాస్కుల్ని దొంగతనం చేసే ఆరాచకం కూడా మొదలైంది. జపాన్ లోని కోబే నగరంలోని రెడ్ క్రాస్ ఆసుపత్రిలో ఆరువేల మాస్కులున్న బాక్సుల్ని దొంగలు చోరీ చేయటం సంచలనంగా మారింది.

మాస్కులు.. టాయిలెట్ పేపర్ల డిమాండ్ జపాన్ కంటే హాంకాంగ్ లో మరింత ఎక్కువగా ఉంది. వీటి కోసం సాగుతున్న దోపిడీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆయుధాలు తీసుకొని షాపుల్లోకి వస్తున్న కొందరు మాస్కులు.. టాయిలెట్ పేపర్లను బలవంతంగా తీసుకెళుతున్నారు. ఇలాంటి ఘటనలకు పరాకాష్ఠ లాంటి ఉదంతం ఒకటి హాంకాంగ్ లో చోటు చేసుకుంది. టాయిలెట్ పేపర్ లోడు తో వెళుతున్న వాహనాన్ని కొందరు దుండగులు అడ్డుకొని అందులోని టాయిలెట్ పేపర్ల బండిల్స్ ను లూటీ చేయటం చూస్తే.. అవసరం కాస్తా కొరతగా మారితే నాగరిక సమాజం లో అనాగరికంగా పెల్లుబుకుతుంది. అందుకు తాజా ఉదంతాలే నిదర్శనంగా చెప్పక తప్పదు.