Begin typing your search above and press return to search.

గులాబీ బాస్ కు ఓటమికి మించిన షాక్ - బీజేపీకి 31.43 శాతం వస్తే.. టీఆర్ఎస్ కి కేవలం 30.79 శాతం!

By:  Tupaki Desk   |   5 Dec 2020 4:11 AM GMT
గులాబీ బాస్ కు ఓటమికి మించిన షాక్ - బీజేపీకి 31.43 శాతం వస్తే.. టీఆర్ఎస్ కి కేవలం 30.79 శాతం!
X
గ్రేటర్ ఎన్నికల ఫలితాలపైన ఇప్పుడిప్పుడే స్పష్టత నెలకొంటోంది. సుదీర్ఘ కాలం తర్వాత బ్యాలెట్ బ్యాకులతో నిర్వహించిన ఎన్నికల్లో.. ఎన్నికల సిబ్బంది పనితీరు.. ఫలితాన్ని ఆలస్యంగా ప్రకటించే చేయటంతోపాటు.. పలు గందరగోళాలు చోటు చేసుకునేలా చేశాయి. అధికారిక సమాచారం కూడా ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే.. సీట్ల విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు లేకుండా చేశాయి. అందరికి అవసరమైన క్లారిటీ ఉంది. టీఆర్ఎస్ కు 55 డివిజన్లు దక్కితే.. బీజేపీకి48 డివిజన్లు దక్కాయి. మజ్లిస్ కు 44.. కాంగ్రెస్ 2 డివిజన్లను సొంతం చేసుకున్నాయి.

ఈ సమాచారం అందరికి తెలిసిందే. అయితే.. ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం.. అందులో ఏ పార్టీకి ఎంత శాతం మేర ఓట్లు లభించాయన్న లోతుల్లోకి వెళితే.. ఆశ్చర్యకరమైన అంశాలు బయటకు వస్తాయి. గులాబీ బాస్ కు దిమ్మ తిరిగిపోయేలా గ్రేటర్ ఓటర్ తీర్పు ఇచ్చారు. చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా.. స్వల్ప మెజార్టీలు.. సెటిలర్లు కానీ గులాబీ పార్టీని ఆదుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. సీట్లు సాధించే విషయంలో టీఆర్ఎస్ ముందున్నా.. ఓట్ల శాతంలో మాత్రం వెనుకపడటం విశేషం. అదే సమయంలో సీట్ల సాధనంలో రెండో స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీకి.. పోలింగ్ లో ఓట్ల శాతం ఎక్కువ శాతాన్ని సొంతం చేసుకోవటం ఒక ప్రత్యేకతగా చెప్పాలి.

మొత్తం పోలైన ఓట్లలో.. బీజేపీకి 31.43 శాతం ఓట్లు వస్తే.. టీఆర్ఎస్ పార్టీకి కేవలం 30.79 శాతం మాత్రమే వచ్చాయి. అంటే.. బీజేపీకి కంటే.. 0.64 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. ఇక.. మజ్లిస్ 15.97 శాతం ఓట్లను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ 5.95శాతానికి పరిమితమైంది. ఈసారి బీజేపీకి అత్యధికంగా 12.13 లక్షల ఓట్లు రాగా.. టీఆర్ఎస్ కు 11.89 లక్షల ఓట్లకు మాత్రమే పరిమితమైంది. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 3.46 లక్షలకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 10 లక్షల ఓట్లను తన ఖాతాలో జమ వేసుకుంది. దీంతో.. గులాబీ కారుకు పంక్చర్ పడేలా చేయటమే కాదు.. పెద్దసారుకు దిమ్మ తిరిగే షాక్ తగిలినట్లైంది. కారు దూకుడుకు దుబ్బాక బ్రేకులు వేస్తే.. గ్రేటర్ ఎన్నిక ఫలితం బోల్తా కొట్టేలా చేసింది. అదే సమయంలో.. దుబ్బాకలో విరిసిన కమలం.. హైదరాబాద్ మహానగరంలో విరబూసింది. మొత్తంగా గులాబీ బాస్ కు వార్నింగ్ బెల్స్ మోగేలా చేశాయి.