Begin typing your search above and press return to search.

కరోనా అయిన కత్రినా అయిన ..మాకు కల్లు కావాల్సిందే !

By:  Tupaki Desk   |   27 March 2020 3:00 PM GMT
కరోనా అయిన  కత్రినా అయిన ..మాకు కల్లు కావాల్సిందే !
X
కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా ఆపాలని కేంద్రం , అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశాన్ని 21 రోజుల పాటు లాక్ డౌన్ చేసాయి. అయితే , దేశంలోని చాలామంది ఈ లాక్ డౌన్ కి సహకరించి ..ఇంట్లోనే ఉంటున్నప్పటికీ కూడా ..కొంతమంది మాత్రం బయటకి వస్తున్నారు. తాజాగా తెలంగాణలో మరో కొత్త సమస్య వచ్చింది. తెలంగాణ లోని చాలా జిల్లాలలో కల్లు రోజు తాగుతారు. కానీ , ఒక్కసారిగా 21 రోజుల లాక్ డౌన్.. ఎటూ కదలక ఇంట్లో కూర్చొంటే డీ-ఎడిక్షన్ సెంటర్‌లో కూర్చొన్నట్టే భావిస్తున్నారు. దీనితో పోలీసులు ఏం చేసినా పర్లేదు కానీ , మాకు కల్లు కావాల్సిందే అని రోడ్ల పైకి వెళ్లి కల్లు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడనీ కుటుంబాలు ఇలా మాయదారి కల్లుకు చిన్నాభిన్నం అవుతున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో రోగం తిరగబెట్టడంతో ఆ కుటుంబాలకు కొత్త టెన్షన్ పట్టుకుంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో మత్తు కల్లుకు డిమాండ్ ఎక్కువ. బోధన్, ఆర్మూర్, దోమకొండ, బీబీపేట్‌, రాజంపేట్‌, మాచారెడ్డి,భిక్కనూరు,రేంజర్ల,బిర్కూర్‌ సహా తదితర గ్రామాల్లో కల్లుబట్టీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ సప్లై చేసేది చెట్టు నుంచి దించిన కల్లు కాదు, కల్తీ కల్లు. రసాయనాలు కలిపి తయారుచేసే ఈ కల్తీ కల్లుకు బానిసలైన వారు చాలామంది ఉన్నారు. నిత్యం చుక్క పడనిదే వీళ్లకు రోజు గడవదు. లేదంటే పరిస్థితి ఆగామాగమే. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి ఘటనలు బయటపడ్డాయి. కల్లుబట్టీలు బంద్ చేసినప్పుడల్లా జనం మానసిక రోగుల్లా కల్లు కోసం తపించేవారు. శరీరం వణికిపోయేది.. కొంతమంది నిలబడ్డ చోటే కూలిపోయేవారు. ఆసుపత్రికి తీసుకువెళ్లినా కూడా ..కల్లు కావాలి అనేవారు. తాజాగా లాక్ డౌన్ విధించడంతో మరోసారి అదే పరిస్థితి ఎదురైంది

ఇంట్లోనే ఉన్నా.. డీఎడిక్షన్ సెంటర్‌లో ఉన్నట్టుగా భావిస్తున్నారు. దీంతో కరోనాతో ప్రాణం పోయినా సరే.. కల్లు కావాలంటూ కల్లుబట్టీల వద్దకు వస్తున్నారు. కల్లు ప్రియులంతా పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడుతుండటంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఆదేశాలకు భంగం కలుగుతోంది.పైగా ఎవరూ మాస్కులు ధరించడం గానీ,సోషల్ డిస్టెన్స్ గానీ పాటించడం లేదు. పోలీసులని కూడా లెక్కచేయడంలేదు. ఏమి చేసినా కూడా కల్లు కావాల్సిందే అంటూ కల్లు దుకాణం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాలలో సర్పంచులు కల్లుని ఇంటి వద్దకే పంపిణీ చేసినట్టు తెలుస్తోంది.

తమ ఇళ్లల్లో కల్లుకు బానిసలైన మగవాళ్లు లాక్ డౌన్‌ కారణంగా తల్లడిల్లుతున్నారని అక్కడి మహిళలు చెబుతున్నారు. పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ చెట్లెక్కడం,పుట్టలెక్కడం చేస్తున్నారన్నారు. కూరగాయాలు అమ్ముకునే,కూలీ నాలీ చేసుకునే తాము.. వాళ్లనే గమనిస్తూ కూర్చొంటే రోజు గడవదని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వమే ప్రతీ రోజూ ఉదయం ఒక రెండు గంటలు,సాయంత్రం ఒక రెండు గంటలు కల్లు దుకాణాలు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశం అంతా కరోనా తో బయపడుతుంటే ..వీరిది మరో భాద. సాధారణంగా అలాంటి కల్లు షాప్స్ లో కల్లుని డైజోఫామ్‌, క్లోరోఫామ్‌, ఆల్ఫడాజో లాంటి రసాయన పదార్థాలను కలుపుతారు. దాంతో అది సేవించినవారికి తీవ్రమైన మత్తు ఎక్కుతుంది. ఒక్కసారి దానికి అలవాటుపడ్డారంటే చాలామంది బానిసలై పోతారు. దీనితో కల్లు లేకపోతే ఉండలేక పోతున్నారు. ఈ విషయం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.