Begin typing your search above and press return to search.

కుమారస్వామి ప్యాకేజి ఎంత...?

By:  Tupaki Desk   |   6 Oct 2022 12:30 PM GMT
కుమారస్వామి ప్యాకేజి ఎంత...?
X
ఆయన తెలంగాణా కంటే కూడా పెద్ద రాష్ట్రం అయిన కర్నాటకకు మూడు సార్లు సీఎం గా పనిచేశారు. ఆయన తండ్రి దేవేగౌడ దేశానికి ప్రధానిగా పనిచేశారు. బలమైన సామాజికవర్గంతో కన్నడ రాజకీయాల్లో ఈ రోజుకీ ప్రభావం చూపించగలిగే స్థితిలో జేడీ ఎస్ ఉంది. ఇంకా చెప్పాలీ అంటే కేసీయార్ కంటే కూడా ముందు సీఎం అయింది కుమారస్వామే. అలాంటి కుమారస్వామి కేసీయార్ ముందువచ్చి వంగి సలాం కొడుతున్నారు. జయజయద్వానాలు వినిపిస్తున్నారు.

టీయారెస్ బీయారెస్ గా మారిన కార్యక్రమానికి ఆయన అటెండ్ అయి కేసీయార్ కి మద్దతు ప్రకటించారు. దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసి తాము కూడా గెలవని పార్టీలు ఉన్నాయి. కానీ అవేమీ కేసీయార్ బీయారెస్ కి మద్దతుగా రాలేదు. కారణం వాటికి తమ సొంత అస్థిత్వం ముఖ్యమనే భావన ఉండబట్టే అంటున్నారు.

ఈ రోజు ఓడినా రేపు గెలిచి తమ సొంత కాళ్ల మీద తాము నిలదొక్కుకుంటామన్న ధీమా కూడా వారికి ఉంది. మరి ఎన్నో సార్లు సీఎం అయి ఈ రోజుకు కూడా కర్నాటకలో కింగ్ మేకర్ స్థానాన్ని పదిలంగా ఉంచుకున్న కుమార స్వామికి కేసీయార్ తో కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆయన ఎందుకు ఈ రకమైన స్టెప్ తీసుకున్నారు అన్న చర్చ అయితే గట్టిగానే సాగుతోంది.

కర్నాటకలో ఈ రోజుకీ కొన్ని జిల్లాలలో జేడీఎస్ కి పట్టు ఉంది. అక్కడ ముప్పై నుంచి నలభై సీట్లు గెలుచుకుంటే కచ్చితంగా సీఈం పీఠం కాళ్ల దగ్గరకు వస్తుంది. అది బీజేపీ నుంచి అయినా లేక కాంగ్రెస్ నుంచి అయినా ఆఫర్ గా రావచ్చు. మరి అన్నీ తెలిసిన కన్నడ కుమారస్వామి కేసీయార్ వెంట పడుతున్నారు అంటే ఆయన పార్టీకి ఆర్ధికంగా సాయం కావాల్సి రావచ్చు అని అంటున్నారు.

ఎన్నికల్లో ధనం ఉండాలి. లేకపోతే ఎలాంటి వారు అయినా రాజకీయం చేయలేరు. బహుశా అలాంటి ఇబ్బందులు ఏవైనా కుమారస్వామి పార్టీకి ఉన్నాయా ఆ మేరకు ఫండ్స్ విషయంలో ఏదైనా హామీ పుచ్చుకుని ఆయన జై బీయారెస్, జై కేసీయార్ అని అంటున్నారా అన్న గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఏదీ లేకుండా ఏమీ కాకుండా రావడానికి ఎవరైనా ఎందుకు ఉత్సాహం చూపిస్తారు.

ఇది ఫక్తు రాజకీయం ఇచ్చుకున్న వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళూ కూడా అన్నీ తెలిసే రాజకీయం చేస్తూంటారు. అలా కనుక చూస్తే కుమారస్వామి రాజకీయాన్ని తనదైన శైలిలో చేస్తున్నారా అన్న డౌట్లు రాక మానవు. చూడాలి మరి ఈ ఇద్దరి స్నేహం వారి రాజకీయ కధ ఎంతదూరం సాగుతుందో.

ఏది ఏమైనా కుమారస్వామి విషయంలో మాత్రం విమర్శలు బాగా వస్తున్నాయి. ఇంత బతుకూ బతికి అన్నట్లుగా తండ్రి దేశానికి ప్రధానిగా చేసి కుమారుడు ముమ్మారు సీఎం గా చేసి ఉప ప్రాంతీయ పార్టీ అధినేత వద్ద సాగిలపడడం ఆయనే దిక్కు పాహిమాం అంటూ స్తోత్ర పాఠాలు వల్లించడం చూసిన వారు అంతా కుమార రాజకీయం ఇంతేనా అని విమర్శిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఒకనాడు వెలిగిన దేవేగౌడ కుటుంబం ఆయన కుమార‌ రత్నం పుణ్యమాని ఇలా విమర్శల పాలు అవుతోందా అన్న చర్చ కూడా సాగుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.