Begin typing your search above and press return to search.

నాలుగేళ్లలో ప్రచారానికి అంత ఖర్చా కేసీఆర్?

By:  Tupaki Desk   |   21 Nov 2020 5:45 AM GMT
నాలుగేళ్లలో ప్రచారానికి అంత ఖర్చా కేసీఆర్?
X
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో.. ప్రత్యర్థి పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. పబ్లిక్ టాయిలెట్లు మొదలుకొని..భారీ హోర్డింగుల వరకు ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రచారమే కనిపించక మానదు. మరో పార్టీకి చోటు ఇవ్వని రీతిలో చేస్తున్న ఈ ప్రచారం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చతో పాటు.. వ్యంగ్య వ్యాఖ్యల్ని పలువురు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక ఆసక్తికర ప్రశ్నను సంధించారు. 2014 నుంచి 2018 అక్టోబరు మధ్య కాలంలో కేసీఆర్ సర్కారు ప్రచారం కోసం చేసిన ఖర్చు ఎంతన్న వివరాల్ని వారు కోరారు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రచారం కోసం పెట్టిన ఖర్చు ఏకంగా రూ.310.7కోట్లుగా తేల్చారు.

ఈ ఖర్చులో రోడ్ల వెంట హోర్డింగులు.. పోస్టర్లు.. టీవీ చానళ్లు.. ఇలా వేటికెంత ఖర్చు చేశారన్న వివరాలు ఉన్నాయి. అవుట్ డోర్ ప్రకటనలకు రూ.190 కోట్లు ఖర్చు చేయగా.. జాతీయ టీవీ చానళ్లలో ప్రకటనల కోసం రూ.119 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తెలంగాణ ఆవరణ దినోత్సవం సందర్భంగా ఎక్కువగా ఖర్చు చేసినట్లు తేలింది.

బోనాలు.. బతుకమ్మ.. తెలంగాణ అవతరణ దినోత్సవం.. గోదావరి పుష్కరాలు.. హరిత హారం.. క్రిష్ణ పుష్కరాలు.. మేడారం జాతర ఇలా చెప్పుకుంటూ పోతే.. పలు కార్యక్రమాల కోసం భారీగా ఖర్చు చేసినట్లుగా వివరాలు బయటకు వచ్చాయి. గ్రేటర్ ఎన్నికల వేళ హైదరాబాద్ మహానగరం కోసం రూ.67వేల కోట్లు ఖర్చు చేసినట్లు యువరాజు కేటీఆర్ వెల్లడించారని.. రూ.310 కోట్లు కేవలం ఎన్నికల ప్రచారానికి వినియోగించారని.. ఈ లెక్కన మిగిలిన ఖర్చుల్లో ఇలాంటివి మరెన్ని ఉన్నాయో? అన్న సందేహం కలుగక మానదు.

చివరగా.. ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ప్రచారం కోసం వినియోగించిన మొత్తం ఎంతో తెలుసా? సుమారు రూ.8.5 కోట్లు. ప్రజాధనాన్ని ఇలా పబ్లిసిటీ కోసం ఇంత భారీగా ఖర్చు చేయటమా? అన్న మాట వినిపిస్తోంది. విలువైన ప్రజాధనాన్ని తమకు తోచినట్లుగా ఖర్చుచేసే ప్రజాప్రభుత్వాలు ఇంతకు మించి ఇంకేం చేయగలవన్న భావన కలుగక మానదు. ఆదర్శపు మాటలు కోటలు దాటుతున్న వేళ.. వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.