జనసేనానిలో ఎంత మార్పు... రాజకీయం సూపర్ హిట్టేనా...?

Mon Aug 15 2022 18:00:01 GMT+0530 (IST)

How much change in Jana Senani... Is politics a super hit...?

పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వారిగానే చూడాలి. ఆయన తనకంటూ కొన్ని ప్రత్యేకమైన భావజాలం కలిగి ఉంటారు అని చెబుతారు. ఆయన ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటాయి. ఆయన అనేక పుస్తకాలను చదివారు. ఆయన పెద్దలను ఎపుడూ చూడరు పేదలను చూస్తారు. పేదరికం మీద ఆయనకు సానుభూతి ఉంది. నిజానికి ఆయన ఉండేది బంగళాలలో. కానీ ఆయన చూసే నేల చూపులు మాత్రం చిత్రంగా తోస్తాయి.ఇక విధంగా చెప్పాలీ అంటే పవన్ లో చాలా వినూత్న భావజాలం ఉంది. ఇపుడున్న సమాజాన్ని రాత్రికి రాత్రి మార్చేయాలన్న ఆవేశం ఉంది. అలాగే అనేక సామాజిక రాజకీయ రుగ్మతలను కూడా తీసి పక్కన పెట్టాలన పట్టుదల ఉంది. అందుకే ఆయన రాజకీయ పార్టీ పెట్టారు. అవినీతి ఎక్కడ నుంచి పుట్టుకువస్తోంది అంటే అభ్యర్ధులు  ఎన్నికల్లో పోటీ చేసే దగ్గర నుంచే అని అంతా అంటారు. అది నిజం కూడా.

ఓట్ల కోసం ఏ అభ్యర్ధి అయినా ఎక్కువగా ఖర్చు చేస్తే దాన్ని వసూల్ చేసుకోవడానికే అయిదేళ్ల కాలం గడిపేస్తారు. అపుడు ప్రజలకు అందే ఫలాలు కూడా ఏమీ ఉండవు. ఇప్పటిదాకా ఈ దేశాన సాగుతున్నది అదే. దీన్ని ట్రెడిషనల్ పాలిటిక్స్ అని అంటారు. పవన్ కళ్యాణ్ దీన్ని చేదించడానికి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ 2019 ఎన్నికల్లో జనాల ముందుకు వచ్చారు. నాడు ఆయన పోటీ చేసిన రెండు చోట్ల కూడా పైసా కూడా ఖర్చు చేయలేదు. ఫలితంగా గెలుపు  దగ్గరకు వచ్చి మరీ ఎన్నికల్లో ఓటమిని మూటకట్టుకున్నారు.

ఆనాడు పవన్ మాత్రమే కాదు ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన పెద్ద నాయకులు ఎవరూ కూడా డబ్బులు ఓట్ల కోసం ఖర్చు చేయలేదు ఫలితంగా జనాదరణ ఉండి కూడా జనసేన ఓడింది. ఈ సత్యం పవన్ కి తెలుసు. అయినా ఇన్నాళ్ళూ మీమాంసలో గడిపారు. అయితే ఎన్నికల విధానాలను రాత్రికి రాత్రి ఎవరూ మార్చలేరు. ఈ పొలిటికల్  గేమ్ ఇలాగే సాగుతూంటే ఏ ఆటగాడు అయినా గెలవాలీ అంటే ఇదే రూట్ ని ఎంచుకోవాలి. వచ్చే ఎన్నికల్లో ఏలాగైనా గెలిచి తీరాలని తపన పడుతున్న పవన్ కళ్యాణ్ ఇపుడు కొత్త ఆలోచనలు చేస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి.

జనసేన ఐటీ వింగ్ సమావేశంలో పవన్ మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ చూస్తే జనసేన ఈసారి జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి చెక్ పెట్టేసినట్లేనా అన్న చర్చ సాగుతోంది.  దీంతో ఎన్నికల్లో ఎవరైనా సరే  డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని పవనే స్వయంగా చెప్పడం విశేషం. అంటే ఈసారి జనసేన తరఫున పోటీ చేసేవారు కూడా డబ్బులు తీయాల్సిందే అన్న మాట. అదే కనుక జరిగితే ప్రజాదరణ బాగా ఉన్న కొన్ని సీట్లలో అయినా జనసేన గెలిచి తీరడం ఖాయం. ఇక జనసేన వేవ్  కనుక కనిపిస్తే ఇంకా ఎక్కువ సీట్లే దక్కుతాయి.

మొత్తానికి ట్రెడిషనల్ పాలిటిక్స్ కి  దూరంగా  ఉండాలని భావించినా జనసేన వల్ల కావడంలేదు అనే అంటున్నారు. అందుకే జనసేన తానుగా పెట్టుకున్న కఠినమైన  నియమ నిబంధలను పక్కన పెట్టి మరీ అసలైన పోటీ ఇవ్వబోతోంది. అదే జరిగితే ఈసారి జనసేన బొమ్మ సూపర్ హిట్టే అంటున్నారు. చూడాలి మరి 2024 లో ఏమి జరుగుతుందో.