Begin typing your search above and press return to search.

టీకాతో చనిపోతే ప్రభుత్వానిది బాధ్యత ఎలా?

By:  Tupaki Desk   |   25 Jan 2021 5:30 AM GMT
టీకాతో చనిపోతే ప్రభుత్వానిది బాధ్యత ఎలా?
X
కరోనా వైరస్ వ్యాక్సినేషన్ టీకా వేయించుకున్న ఓ ఆశా కార్యకర్త విజయలక్ష్మి చనిపోయారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెనుమాక ఆశా కార్యకర్తగా పనిచేసేవారు. 20వ తేదీన వ్యాక్సినేషన్ టీకా వేయించుకున్న తర్వాత రెండోరోజు నుండి అనారోగ్యం మొదలైంది. టీకా తీసుకున్న రెండోరోజు ఆమెకు తలనొప్పి, మగత, వాంతులు మొదలయ్యాయి. దాంతో ఆమెను వెంటనే సర్వజనాసుపత్రిలో చేర్పించారు.

అయితే ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమె మరణించారు. మొత్తానికి ఆమె మరణించింది మాత్రం బ్రెయిన్ స్ట్రోక్ తో నే అని వైద్యాధికారులు నిర్ధారించారు. టీకా తీసుకున్న తర్వాత పై లక్షణాలు బయటపడటం అందులోను చివరకు బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోవటంతో వైద్యాధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మృతురాలు తీసుకున్న టీకా వెయిల్ నే మరో పదిమందికి కూడా వేశారు. టీకా వేయించుకున్న పదిమందిలో ఓ డాక్టర్ కూడా ఉన్నారు. మరి వాళ్ళెవరికీ ఎటువంటి సైడ్ ఎఫెక్టులు కనబడలేదు.

ఒకే వెయిల్ ను వేసుకున్న పదిమందిలో ఒక్కరికి మాత్రమే సైడ్ ఎఫెక్టులు బయటపడటం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోవటం అంటే టీకా వేయించుకోకముందే ఆమెకు అనారోగ్య సమస్యలు ఉండి ఉండాలని వైద్యులు అనుమానిస్తున్నారు. అందుకే ఆమె హెల్త్ హిస్టరీని సేకరిస్తున్నారు. సరే ఇపుడు ఏమి సేకరించినా వచ్చే ఉపయోగం ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు సేకరించే హెల్త్ హిస్టరీ ఏదో టీకా వేయకముందు సేకరించుంటే ఇప్పుడీ అనర్ధం జరిగేదే కాదు.

కాబట్టి ఇఫ్పటికైనా టీకా వేసేముందే వేయించుకునే వాళ్ళ మెడికల్ హిస్టరీని తెలుసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత కాలంలో చాలామందికి బీపీ, షుగర్ లాంటి సమస్యలు కామన్ అయిపోయాయి. మరి ఇలాంటి కామన్ సమస్యలున్నవాళ్ళు వ్యాక్సినేషన్ వేయించుకుంటే సైడ్ ఎఫెక్టులు వస్తాయా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఏదేమైనా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటే అందరికీ మంచిదనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి.

నిజానికి టీకా వేయించుకున్న తర్వాత ఎవరైనా చనిపోయినా ప్రభుత్వానికి ప్రత్యక్ష బాధ్యతేమీ లేదు. అయినా ఇపుడు చనిపోయిన విజయలక్ష్మి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. పైగా నష్టపరిహారంగా రూ. 50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. టీకాను తయారుచేసింది ప్రభుత్వం కాకపోయినా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అందుకనే టీకా వేయించుకునే ముందే ముందుజాగ్రత్తలు తీసుకుంటే మంచిది.