మావో పార్టీ అగ్రనేత ఆర్కే ఎలా చనిపోయారు?

Fri Oct 15 2021 12:00:01 GMT+0530 (IST)

How did Maoist party leader RK die

అక్కినాజు హరగోపాల్ అన్నంతనే చాలామందికి గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే అన్నంతనే ఆయన రూపం గుర్తుకు వస్తుంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మావో పార్టీ అగ్రనేతతో ఉమ్మడి రాష్ట్రం చర్చలు జరపటం.. ఇందుకోసం ఆర్కే బయటకు వచ్చి.. చర్చల్లో స్వయంగా పాల్గొనటం తెలిసిందే. ఆయన తాజాగా మరణించినట్లుగా వార్తలువస్తున్నాయి. ప్రజా సంఘాలు.. హక్కులసంఘాల నేతలతో పాటు..ఆయన కుటుంబీకులు మాత్రం ఆయన మరణించిన వైనాన్ని నిర్దారించటం లేదు. పోలీసులు మాత్రం ఆయన మరణించినట్లుగా చెబుతున్నారు.
దండకారణ్యంలోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితమే ఆర్కే మరణించారన్న వాదన వినిపిస్తోంది. అయితే.. ఈ విషయం మీదా మావో పార్టీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అదే సమయంలో ప్రజా సంఘాల నేతలు మాత్రం.. ఆర్కే అనుపానులు తెలుసుకోవటానికి పోలీసులు పన్నిన కుట్రగా చెబుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆర్కే సతీమణి శిరీషా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్నారు. ఒక కేసులో అరెస్టు అయిన ఆమె.. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలై.. బహిరంగ జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ఆమె బయటే ఉన్నారు. ఇక.. ఆర్కే కుమారుడు మున్నా 2016లో రామ్ గూడలో జరిగిన ఒక ఎన్ కౌంటర్ లో మరణించిన సంగతి తెలిసిందే.

నిజంగానే ఆర్కే మరణించారా? అయితే.. ఆయన ఎలా మరణించారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గడిచిన ఎనిమిది నెలలుగాఆర్కే తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ మధ్యన కరోనా బారిన పడిన ఆయన.. తీవ్రమైన శ్వాసకోస సమస్యలతో బాధ పడుతున్నట్లుగా చెబుతున్నారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆర్కే నరాల సంబంధిత సమస్యను ఆయన తీవ్రంగా ఎదుర్కొంటున్నారని.. సరైన వైద్యం అందకే ఆయన మరణించి ఉంటారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా తెలుగు మీడియాకు చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థ ఒకటి బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ను ఫోన్లో కాంటాక్టులోకి వెళ్లారు. ఆర్కే మరణంపై తమకూ సమాచారం వచ్చచిందని.. ధ్రువీకరించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా సరైన వైద్య సదుపాయాలు అందని వేళ.. 65 ఏళ్ల వయసులో కరోనా అనంతర ఆరోగ్య సమస్యలతోనే ఆర్కే కన్నుమూసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. మావో ఉన్నత శిఖరం ఒకటి ఒరిగింది. ఆదర్శాల కోసం తుపాకీ పట్టిన ఆర్కే.. తన లక్ష్యం సిద్ధించక ముందే ప్రాణాలు వదిలారని చెప్పక తప్పదు.