Begin typing your search above and press return to search.

పవర్లోకి వచ్చిన పదేళ్లకు ఇంకా అదే సెంటిమెంట్ అయితే ఎలా కేసీఆర్?

By:  Tupaki Desk   |   18 March 2023 7:00 AM GMT
పవర్లోకి వచ్చిన పదేళ్లకు ఇంకా అదే సెంటిమెంట్ అయితే ఎలా కేసీఆర్?
X
సూపర్ హిట్ అయిన సినిమా కథను పోలిన కథతోనే మరో సినిమా తీస్తే? ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. అలానే.. రాజకీయాల్లో ఒక వ్యూహం బ్రహ్మండంగా పని చేస్తే.. దాన్నే అదే పనిగా రిపీట్ చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది. సినిమాల్లో మాదిరే.. ఒకసారి సూపర్ హిట్ అయిన ఫార్ములా.. రాజకీయాల్లోనూ ఒకసారే వర్కువుట్ అవుతుంది. కొన్నిప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయి.

తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకొన్న కేసీఆర్ మాత్రం గడిచిన కొన్నేళ్లుగా రాజకీయాల్ని చేస్తూ.. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తన అధీనంలో ఉంచుకునేలా చేయటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సెంటిమెంట్ ను రగిలించి.. అధికారంలోకి రావటమే కాదు.. పదేళ్లుగా అధికారపీఠం మీద కూర్చొని పాలిస్తున్న సంగతి తెలిసిందే. విపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతీయ సెంటిమెంట్ ను ఎన్నిసార్లు ప్రయోగించినా అంతో ఇంతో వర్కువుట్ అవుతుంది. అయితే.. ఎప్పుడైతే అధికరాంలోకి వస్తారో.. అప్పటి నుంచి సెంటిమెంట్ ను ఆచితూచి అన్నట్లుగా వినియోగించాలి.

ప్రజాసమస్యల మీదనో.. మరేదైనా న్యాయమైన అంశాల విషయంలో ప్రస్తావించటం ద్వారా పెద్ద ఇబ్బందులు ఉండవు. అందుకు భిన్నంగా తమ ప్రయోజనాల కోసం.. తాము చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేస్తే.. ఆ విషయాలు వెంటనే బయటకు వచ్చేస్తాయి. గతంలో మీడియా మాత్రమే ఉండేది. విషయాలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. మీడియా చెప్పని ఎన్నో అంశాల్ని సోషల్ మీడియాలో ఇట్టే బయటకు వచ్చేస్తున్నాయి. ఆ మాటకు వస్తే.. ఊహకు అందని అంశాల మీద చర్చ కూడా సాగుతోంది.

ఇలాంటి వేదికలు ఉన్న వేళలో.. సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేసినంత మాత్రాన తాము అనుకున్నది జరగదన్నది మర్చిపోకూడదు. తెలంగాణ మీద దాడి.. తెలంగాణ ప్రజల హక్కుల మీద దాడికి తెలంగాణ పాలకులుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ అండ్ కోకు ఎదురయ్యే సవాళ్లు ఏవీ తెలంగాణతో సంబంధం ఉన్నవి కాదన్నది మర్చిపోకూడదు. ఈ విషయంలో కేసీఆర్ అండ్ కో ఒకలా ఆలోచించొచ్చు కానీ తెలంగాణ ప్రజలు మాత్రం వారు అనుకున్నట్లుగా ఆలోచిస్తారని అస్సలు అనుకోకూడదు.

ఒకవేళ తప్పుడు అభిప్రాయంతో ఉంటే.. అందుకు తగ్గ గుణపాటం ఎదురవుతుందన్నది మర్చిపోకూడదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత.. ఈడీ తనకు ఇచ్చే నోటీసులను తన మీద జరిగే వ్యక్తిగత దాడిగా.. రాజకీయంగా తమ కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లుగా చెప్పుకోవటం వల్ల తమ మీద సానుభూతి అలల మాదిరి వచ్చి పడుతుందనుకోవటం అవివేకం అవుతుందన్న విషయాన్ని గులాబీ బాస్ ఎప్పటికితెలుసుకుంటారో చూడాలి.

లేకుంటే.. సెంటిమెంట్ రాజేసే ప్రయత్నంలో ప్రజల నుంచి ప్రతికూలతల్ని సైతం ఎదు్కొవాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. సుదీర్గ రాజకీయ చరిత్ర ఉన్న కసీఆర్ ఎప్పటికి గుర్తిస్తారో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.