Begin typing your search above and press return to search.

ఏపీ మూడ్ : 2024లో జనాల తీర్పు ఎలా ఉంటుందంటే...?

By:  Tupaki Desk   |   28 Jun 2022 1:30 AM GMT
ఏపీ మూడ్ : 2024లో జనాల తీర్పు ఎలా ఉంటుందంటే...?
X
ఏపీ ప్రజలు వివేచనాపరులు. వారి ఆలోచనలను ప్రభావితం చేయడం ఎంతటి గండరగండ రాజకీయ నేతకు కూడా అసాధ్యం అని చెప్పాలి. ఇక ఉమ్మడి ఏపీ నుంచి చూసుకుంటే ప్రతీ ఎన్నికల్లో నిర్దిష్టమైన తీర్పుని ఇవ్వడమే జనాలకు తెలుసు. ఏ ఎన్నికలోనూ హంగ్ వచ్చిన సందర్భాలు అయితే లేదు. పొరుగున ఉన్న రాష్ట్రాలలో అది జరిగి ఉండవచ్చు కానీ ఏపీ వరకూ చూస్తే సుస్థిరమైన ప్రభుత్వాన్నే జనాలు ఎపుడూ కోరుకుంటారు.

అందువల్ల కర్నాటకలో జరిగినట్లుగానో మరో చోట అయినట్లుగానో ఏపీలో జరుగుతుంది అని ఎవరైనా భ్రమపడితే పొరబడినట్లే అనుకోవాలి. ఇక ఉమ్మడి ఏపీ విభజన తరువాత చూస్తే 2014లో తొలిసారి చంద్రబాబు నాయకత్వాన తెలుగుదేశాన్ని ఎన్నుకున్నారు. వందకు పైగా సీట్లు ఆ పార్టీకి సొంతంగానే కట్టబెట్టారు. నాడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినపుడు వైసీపీ మంచి ఊపులో ఉంది.

ఈసారి జగన్ సీఎం అవడం ఖాయమని అంతా అనుకున్నారు. చాలా మంది బెట్టింగులు కూడా కట్టారు. కానీ పోలింగునకు రెండు వారాలు ఉన్నాయనగా సీన్ మొత్తం మారిపోయింది. అలా జనాలను మార్చిన విషయాలు అయితే రెండు ఉన్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ అధికారంలోకి వస్తుందని, అలా బీజేపీ సాయం ఏపీకి ఉంటుందని జనాలు తలచారు. ఇక తెలుగుదేశం అధినాయకుడు మంచి అనుభవశాలి అని, ఏపీలాంటి విభజన రాష్ట్రానికి ఆయన తగిన నాయకుడని భావించారు.

దాని వల్లనే తీర్పు మారి చంద్రబాబు సీఎం అయ్యారు. ఇక్కడ జగన్ అంటే ఉన్న మోజు కంటే కూడా రాష్ట్ర ప్రగతినే ఏపీ ఓటర్లు కోరుకున్నారు అని విభజన తరువాత వచ్చిన తొలి ఎన్నిక తీర్పు స్పష్టం చేసింది. ఇక 2019 నాటికి వస్తే అపుడు కూడా జనాలు రాష్ట్ర ప్రగతి గురించి మాత్రమే ఆలోచించి ఓటు చేశారు అనుకోవాలి. కేంద్రంలో మోడీ సర్కార్ చంద్రబాబు అంటే గిట్టకుండా ఉంటోందని, అదే జగన్ తో అయితే సయోధ్యగా ఉంటుందని అందువల్ల ఈ ఇద్దరి కాంబోతో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని నమ్మారు. అలాగే విభజన హామీలు కూడా నెరవేరుతాయని, చక్కని రాజధాని ఉంటుందని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని కూడా ఆశించి జగన్ కి ఓటేశారు.

అయితే మూడేళ్ళ వైసీపీ ఏలుబడిలో ప్రజలు ఆశలు అయితే తీరలేదు, సంక్షేమం పరంగా ఓకేగా ఉన్న రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తే జనాలు అసంతృప్తిగా ఉన్నారనే అంటున్నారు. ఇక 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఈసారి జనాల తీర్పు ఎలా ఉంటుంది అన్న చర్చ అయితే అపుడే మొదలైంది. ఈసారి ఎవరిని ఎన్నుకుంటారు, అసలు పూర్తి మెజారిటీ ఏ పార్టీకైనా వస్తుందా లేక హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

కానీ మొదటి నుంచి చూసిన దాని బట్టి ఆలోచిస్తే ఏపీలో హంగ్ రాదు అనే చెప్పాలి. ఈసారి కూడా కచ్చితంగా ఒక పార్టీకే జనాల మద్దతు ఉంటుంది. మరో పార్టీ అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పడవచ్చు. మరి ఎవరిని ప్రజలు ఎన్నుకుంటారు అన్నది చూస్తే అధికార వైసీపీకి రెండవ సారి చాన్స్ ఇస్తారా లేక తెలుగుదేశాన్ని తెచ్చి పెట్టుకుంటారా లేక కొత్త పార్టీగా జనసేనకు చాన్స్ ఇస్తారా అన్నది కనుక విశ్లేషిస్తే జనాలు ఈసారి కూడా తెలివైన తీర్పు ఇస్తారు అని అంటున్నారు.

అది కూడా రాష్ట్ర ప్రగతి అన్న పాయింట్ తోనే తీర్పు ఉంటుంది అని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ మీద ఆశలు వీడిన సమయంలో ఈసారి ఎన్నికలు జరుగుతాయి. దాంతో కేంద్రం ప్రమేయం లేకుండా ఏపీని డెవలప్ చేసే వారికే పట్టం కట్టడం జరుగుతుంది అని అంటున్నారు. ఇక ఏపీ అప్పుల విషయం మీద కూడా భారీ ఎత్తున చర్చ ఉన్నా అప్పులు ఎవరు వచ్చినా తప్పవు అన్న మాట కూడా ఉంది. అయితే ఆ చేసిన అప్పులు నిర్మాణాత్మకంగా వినియోగించాలి అన్న మాట అయితే జనం నుంచి వస్తోంది.

ఇక ఏపీని రానున్న అయిదేళ్లలో ఎవరు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తారో వారికే జనాలు కచ్చితంగా ఓటేయడం జరుగుతుంది. రెండు ప్రాంతీయ పార్టీలను చూశారు కాబట్టి వేరే మార్గంగా జనసేనను ఎంచుకుంటారా అంటే ఆ పార్టీ సొంతంగా పోటీ చేయడం మీద తాను ఇచ్చే హామీల మీద జనాభిప్రాయం ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం రాజకీయ పార్టీలు అన్నీ గుర్తు పెట్టుకోవాలి. వచ్చే ఎన్నికల్లో జనాలు తాయిలాలు, రాయితీల కంటే కూడా ఏపీని ఎవరు బాగుచేయగలరు అన్న సింగిల్ పాయింట్ అజెండా మీదనే ఓటేయబోతున్నారు. దీన్ని గ్రహించి ప్రధాన పార్టీలు తమ అజెండాలను సిద్ధం చేసుకోవడం అవసరం. ఆ మీదట జనాలు ఎవరిని నమ్ముతారు అన్నది 2024 ఫలితాలలో చూస్తారు.