హృదయవిదారకంః శ్మశానం గేటుకు హౌజ్ ఫుల్ బోర్డు..!

Tue May 04 2021 08:00:01 GMT+0530 (IST)

House full board for the cemetery gate

కరోనా మారణహోమం మాటలకు అందని రీతిలో కొనసాగుతోంది. లక్షలాదిగా నమోదవుతున్న కేసులు.. వేలాదిగా చనిపోతున్న బాధితులను చూస్తే గుండెలు ద్రవిస్తున్నాయి. కర్నాటకలో పరిస్థితి హృదయవిదారకంగా తయారైంది. అక్కడ శవాలను దహనం చేయలేక శ్మశానం ముందు హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టారంటే.. పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.అక్కడ నిత్యం వేలాది కేసులు నమోదవుతున్నాయి. బాధితులు వందలాదిగా చనిపోతున్నారు. ఆదివారం ఒక్క రోజే 217 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. రాష్ట్రంలోని చాలా శ్మశానాలు నిండిపోయాయి. వరద ప్రవాహంలా పోటెత్తుతున్న శవాలను కాల్చలేక శ్మశాన వాటిక నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో.. శ్మశానాల్లో ‘హౌస్ ఫుల్’ బోర్డులు కూడా పెట్టేస్తున్నారు. బెంగళూరులోని చామ్ రాజ్ పేట శ్మశాన వాటికకు రోజుకు 20కిపైగా శవాలు వస్తున్నాయట. దీంతో.. వాటిక నిర్వాహకులు హౌస్ ఫుల్ బోర్డు పెట్టారు. బెంగళూరులో మొత్తం 13 విద్యుత్ దహన వాటికలు ఉండగా.. పదుల సంఖ్యలో వస్తున్న శవాలతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతోందట.

దీంతో.. శవాలకు తమ సొంత స్థలాల్లో అంత్యక్రియలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం ప్రకటించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16 లక్షలు దాటేసింది. ఈ లెక్కలు ఇంకా ఎంత దూరం వెళ్తాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీంతో.. జనాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.