Begin typing your search above and press return to search.

టీనేజ్ అమ్మాయిల ఫోటోలు, సందేశాలు పంపి ఇజ్రాయెల్ సైనికుల పై హానీ ట్రాప్

By:  Tupaki Desk   |   20 Feb 2020 4:10 AM GMT
టీనేజ్ అమ్మాయిల ఫోటోలు, సందేశాలు పంపి ఇజ్రాయెల్ సైనికుల పై హానీ ట్రాప్
X
హానీ ట్రాప్... మనకు తరుచుగా వింటుండే పదం. దేశాలు లేదా వ్యక్తులు.. ప్రత్యర్థుల రహస్యాలు కనుగొనేందుకు అమ్మాయిని ఎరవేయడం లేదా అమ్మాయిలా నడిస్తూ గుట్టు లాగడం హానీట్రాప్. హమాస్ ఉగ్రవాదులు అందమైన యువతులుగా నటిస్తూ ఇజ్రాయెల్ సైనికుల ఫోన్‌లను హ్యాక్ చేసే ప్రయత్నం చేశారు. ఇందుకు డజన్ల కొద్ది సైనికుల స్మార్ట్ ఫోన్లను ఇస్లామిక్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు.

సదరు సైనికుల స్మార్ట్ ఫోన్‌లకు అందమైన అమ్మాయిల్లా సందేశాలు, ఫోటోలు, వాయిస్ సందేశాలు పంపించారు. అయితే దీనిని ఇజ్రాయెల్ మిలటరీ నకిలీ సోషల్ మీడియా ఖాతాలుగా ప్రారంభంలోనే గుర్తించిందట. ఈ మేరకు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది.

తమ సైనికులకు తొలుత టీనేజీ అమ్మాయిల ఫోటోలు పంపించారని, ఓ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకునేలా పురిగొల్పారని సైనిక ప్రతినిధి ఒకరు చెప్పారు. హమాస్ ఉగ్రవాదుల హానీట్రాప్‌ను తాము గుర్తించి, అడ్డుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఎంతోమంది సైనికుల ఫోన్లను టార్గెట్ చేసుకున్నప్పటికీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మాత్రం ఈ క్యాట్ ఫిషింగ్‌ను ముందే గుర్తించిందని, పెద్ద పెద్ద రహస్యాలు లీక్ కాకుండా అడ్డుకుందని చెప్పారు.

హమాస్ ఉగ్రవాదులు డౌన్ లోడ్ చేసుకోమని చెప్పిన యాప్ మాల్వేర్ వైరస్ అని, ఇది ఫోన్ల నుండి డేటాను దొంగిలిస్తుందన్నారు. కీలక సమాచార ఉల్లంఘన జరిగిందని తాము భావించడం లేదని లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ కాన్రికస్ అన్నారు. తాము ఉగ్రవాదుల హ్యాకింగ్ సిస్టం ప్లాన్‌ను కుప్ప కూల్చామని తెలిపారు.

హమాస్ ఉగ్రవాదులు వివిధ మార్గాల్లో టార్గెట్ చేస్తున్నారని, తాజా ప్రయత్నం ఆధునాతనమైనదని జోనాథన్ చెప్పారు. వాట్సాప్, ఫేస్‌ బుక్, ఇన్‌స్టా గ్రామ్, టెలిగ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా కొందరు సైనికులను టార్గెట్ చేసినట్లు చెప్పారు. అమ్మాయిల గొంతుతో సైనికులతో స్నేహం నటిస్తూ ఫోటోలు, సందేశాలు, వాయిస్ మెసేజ్‌లు పంపించారని తెలిపారు.

గాజా పై అదుపు సాధించిన మిలెటంట్ గ్రూప్ హమాస్‌కు ఇజ్రాయెల్‌కు మధ్య శత్రుత్వం ఉంది. హమాస్ సరికొత్త సాంకేతికతను నేర్చుకొని, హ్యాకింగ్‌తో తమ పై పై చేయి సాధించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. హమాస్ హ్యాకర్లు పొడి పొడిగా హిబ్రూ మాట్లాడే, వలస వచ్చిన యువతుల్లా నటించారని కల్నల్ తెలిపారు.

సైనికులకు పంపించిన లింక్స్‌ పై క్లిక్ చేసి, డౌన్ లోడ్ చేసుకుంటే ఆ ఫోన్లను హ్యాక్ చేస్తుంది. ఒకసారి క్లిక్ చేస్తే ఆ లింక్ స్మార్ట్ ఫోన్లోని డేటా, లొకేషన్, ఫోటోల యాక్సెస్‌ను యాకర్ల చేతికి అందిస్తుంది. హ్యాకర్లు ఆ తర్వాత సైనికుల ఫోన్‌ను తమ ఆదీనంలోకి తీసుకుంటారు కూడా. ఫోన్ ఉపయోగించే వారికి తెలియకుండా ఫోటోలు తీయవచ్చు. మాటలు రికార్డ్ చేయవచ్చు.